విద్యార్థుల కొరకు వార్డన్ల గ్రామాల బాట..
జహీరాబాద్ పట్టణంలో నూతనంగా ప్రీమెట్రిక్ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. 120 మందికి ప్రవేశాలు కల్పించేందుకు అవకాశం ఉంది.
దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణంలో నూతనంగా ప్రీమెట్రిక్ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. 120 మందికి ప్రవేశాలు కల్పించేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం వార్డన్, పూర్వ విద్యార్థులు, స్థానిక ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థులను సంక్షేమ బాట పట్టించేందుకు శ్రమిస్తున్నారు. జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లోని మన్నాపూర్, గోవిందపూర్, ఇప్పేపల్లి , మొగుడంపల్లి గ్రామాలలో అర్హులైన విద్యార్థుల కోసం వసతి గృహ సంక్షేమ అధికారి బి.కృష్ణవంశీ పర్యటించారు.
విద్యార్థులకు వసతి గృహంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. మూడో తరగతి నుంచి డిగ్రీ వరకు ఎస్సీ, బీసీ, ఓసీ విద్యార్థులకు వారి కోటాను బట్టి సీట్లు కేటాయిస్తారన్నారు. కావున తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్వం ఇదే వసతి గృహంలో చదివిన విద్యార్థులు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలలో చేరినట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ వసతి గృహంలో చదివి ప్రస్తుతం పీజీ చేస్తున్న పూర్వవిద్యార్థులు, వసతి గృహ సంక్షేమ అధికారితో కలిసి గ్రామాల్లో పర్యటించి హాస్టల్ గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు శివశంకర్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.