సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ చెన్నూరి రూపేష్

సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

Update: 2024-10-24 13:44 GMT

దిశ, జిన్నారం: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశ్రామిక వాడల్లో డ్రగ్స్ దందాలను పూర్తిస్థాయిలో నివారించేలా నిఘాను పటిష్టం చేయాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ పోలీసులకు సూచించారు. గురువారం జిన్నారం మండలంలోని బొల్లారం పోలీస్ స్టేషన్ ను ఎస్పీ చెన్నూరి రూపేష్ సందర్శించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ, సిబ్బంది బ్యారెక్ పరిశుభ్రత, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డులను ఎస్పీ తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ అధిక పరిశ్రమలు ఉండటం వలన ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన మైగ్రేట్ లేబర్ ఎక్కువగా ఉంటారని, సిటీ పరివాహక ప్రాంతం కావున ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు బొల్లారం, అమీన్ పూర్ ప్రాంతాలలో ఉండటానికి ఇష్టపడతారని, అదే అదునుగా దొంగలు చేతివాటం చూపుతారని అన్నారు.

తరుచూ వాహనాల తనిఖీ, నాకా బంది వంటి స్పెషల్ డ్రైవ్ లను చేపట్టి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ, కేడి, సస్పెక్ట్ లను తరుచూ చెక్ చేస్తూ, ఆన్ లైన్ రికార్డులలో అప్డేట్ చేయాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని తెలిపారు. నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి, బాధితులకు అండగా ఉండాలని సూచించారు.

జిల్లాలో ఆల్ఫ్రాజోలం తయారీ, నిషేదిత గంజాయి, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ అమ్మకాలు, అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ లకు తావు లేకుండా కఠినంగా వ్యవహరించాలని సూచనలు చేశారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ, అన్ని అపార్ట్ మెంట్లు, ప్రధాన కూడళ్లలో హై రిజల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అధిక సైబర్ నేరాలు బొల్లారం, అమీన్ పూర్, పటాన్ చెరు స్టేషన్ల పరిధిలో జరుగుతున్నాయని వివరించారు. విధి నిర్వహణలో సిబ్బంది నిబద్దతతో ఉండాలని కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించినప్పుడే అధికారుల మన్ననలు పొందుతారని, చేసిన పనికి గుర్తింపు లభిస్తుందని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, బొల్లారం ఎస్.హెచ్.ఓ గంగాధర్, ఎస్ఐ రాములు, సిబ్బంది ఉన్నారు.


Similar News