ఎవరు‘ఒర్రు’కుంటే మాకేంటీ?

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఒర్రకుంట కనుమరుగైంది. ..

Update: 2024-08-19 03:50 GMT

దిశ, పటాన్ చెరు /గుమ్మడిదల: ఎవరు ఒర్రు కుంటే మాకేంటి... బరాబర్ కుంట మాయం చేస్తాం...అందులో నిర్మాణాలు చేసి విక్రయిస్తాం... అంతా మా ఇష్టం... మమ్మల్నేవారు ఏమీ చేయలేరు... మా జోలికి వచ్చే సాహసం ఎవ్వరికీ లేదు.. రికార్డులు తారుమారు చేశాం.. అధికారులను మా కంట్రోల్లోకి తీసుకున్నాం.. అధికారులంతా మాతోనే ఉన్నారు... మా పైన చర్యలు తీసుకునే సత్తా ఎవ్వరికీ లేదంటూ విర్రవీగుతున్నారు ఆ నిర్మాణదారులు.. ప్రకృతి సంపద అయిన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఒర్రకుంటను కండ్ల ముందే పూర్తిగా మాయం చేసి విల్లాల నిర్మాణానికి తెరలేపారు. గత ప్రభుత్వ పెద్దల సహకారం వెరసి అధికారుల నోరుకట్టి అక్రమంగా కుంటలో విల్లాల నిర్మాణం మొదలుపెట్టారు. అయితే ప్రకృతి సంపదను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘హైడ్రా’ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తుండడంతో ఓర్రకుంటను పునరుద్ధరిస్తుందని ఆశలు చిగురిస్తోంది.

కనుమరుగు...

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఒర్రకుంట కనుమరుగైంది. హెచ్ఎండీఏ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 82లో 2.871 ఎకరాలలో ఒర్ర కుంట విస్తరించి ఉంది. 2017 ఫిబ్రవరి నెలలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ కుంట విస్తీర్ణానికి సంబంధించి సర్వే నిర్వహించి ఈ కుంట( ఐడీ-1000/89) హద్దులను సైతం నిర్ణయించారు. అయితే 2017 సంవత్సరంలో హెచ్ఎండీ అధికారులు సర్వే చేసి నిర్ధారించిన ఈ కుంటపై కన్నేసిన కొందరు నిర్మాణదారులు కుంటను కబ్జా చేశారు. కుంట కబ్జా విషయంలో కదిలిన నీటి పారుదల శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి కుంటను నిర్ధారించారు. గ్రేటర్ ఇన్ఫ్రా నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశంలోనే కుంట ఉందని నిర్ధారిస్తూ అప్పటి సంగారెడ్డి నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ మురళీధర్ 18 మే, 2023 లో జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపారు. గూగుల్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ సహాయంతో కుంట ప్రదేశాన్ని నిర్ధారించారు.

మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు..

సాక్షాత్తు ఇరిగేషన్ అధికారులు ఆ ప్రదేశంలో కుంట ఉందని నిర్ధారించినా నిర్మాణ విషయంలో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకడుగు వేశారు. ఈ నిర్మాణ సంస్థ అయిన గ్రేటర్ ఇన్ ఫ్రా ప్రమోటర్లు అప్పటి ప్రభుత్వంలో పక్క జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడంలో మౌనం వహించారు. ఈ కుంట ఆక్రమణలపై బొల్లారం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా... పత్రికల్లో కథనాలు వచ్చినా మమ్మల్ని ఏమి చేయలేరన్న బరితెగింపుతో కుంటలో నిర్మాణాలను యధావిధిగా కొనసాగించారు. ఈ కంపెనీ యాజమాన్యానికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి జిల్లా రెవెన్యూ అధికారులను మాయ చేసి డబ్బుతో మంత్రమేసి తమకు అనుకూలంగా సర్వే రిపోర్ట్ ను మార్చుకున్నారు. ఆ తప్పుడు సర్వే రిపోర్ట్ సహాయంతో హెచ్ఎండీ అధికారులను ప్రసన్నం చేసుకొని నిర్మాణ అనుమతులను సంపాదించుకున్నారు. హెచ్ఎండీఏ నిర్మాణ అనుమతులు ఇవ్వడంతో మమ్మల్ని ఎవరేం చేయలేరని బరితెగింపుతో ఇష్టారితిగా కుంటను కబ్జా చేసి కాస్ట్లీ విల్లాలను నిర్మిస్తున్నారు. ఒకప్పుడు నీటితో కళకళలాడిన ఆ కుంటను కాంక్రీట్ జంగల్ గా మార్చి కుంట ఆనవాళ్లు పూర్తిగా చేరిపేశారు.

‘హైడ్రా’తో కొత్త ఆశలు..

చెరువులు, కుంటలు, వరద కాలువలను ఆక్రమించి చేస్తున్న నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తూ ప్రకృతి సంపదను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘హైడ్రా’ ఓర్రకుంటను పునరుద్ధరిస్తుందని ఆశలను రేకెత్తిస్తోంది. హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న రంగనాథ్ చెరువులోని అక్రమ కట్టడాలపై విచారణ జరిపి కఠినంగా వ్యవహరిస్తూ కూల్చివేతలు మొదలుపెట్టారు. ఇప్పటికే మహానగరంలో పలుచోట్ల అక్రమ కట్టడాలపై కొరడా జూలూపించిన "హైడ్రా' బృందం గురువారం బాచుపల్లి లోని ఎర్రకుంటలో వెలసిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ కట్టడాలపై దూకుడుగా ముందుకు వెళుతుండడంతో బాచుపల్లిని అనుకోని ఉన్న ఒర్రకుంటలోని అక్రమ విల్లాలపై చర్యలు తీసుకుంటారన్న ఆశలు చిగురిస్తున్నాయి. అయితే అక్రమ నిర్మాణాలపై ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఎంతటి వారినైనా ఎదుర్కొంటామని చెరువుల్లో నిర్మాణాల్లో ఉన్న అక్రమణలను తొలగిస్తామని చెబుతున్న హైడ్రా కమిషనర్ బొల్లారం ఒర్ర కుంటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సంస్థకు సంబంధించిన ప్రమోటర్లు కాంగ్రెస్ గూటికి చేరడంతో హైడ్రా పారదర్శకంగా పనిచేస్తుందా లేదా రాజకీయ పలుకుబడికి తలోంచి అడ్డగోలుగా విర్రవీగుతున్న గ్రేటర్ ఇన్ఫ్రా యాజమాన్యానికి తలోగ్గుతుందా వేచి చూడాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News