అధికారులు ప్రజల పక్షంగా నిలబడి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలి

ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం కాకుండా అధికారులు ప్రజల పక్షంగా నిలబడి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు.

Update: 2024-06-26 13:35 GMT

దిశ, దుబ్బాక : ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం కాకుండా అధికారులు ప్రజల పక్షంగా నిలబడి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. బుధవారం దుబ్బాక ఐవోసీ బిల్డింగ్లో జిల్లా కలెక్టర్ మను చౌదరి అధ్యక్షతన ప్రభుత్వ శాఖల అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఐదేళ్లకొక్కసారి పాలకులు మారుతుంటారని, అధికారులు మాత్రం రిటైరయ్యేంత వరకు ప్రజలతో కలిసి మెలిసి ఉంటారని, అటువంటి ప్రజల అవసరాలు, సేవలు తీర్చడానికి అధికారులు అవినీతి, అక్రమాలు లేని పారదర్శక పనులు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ కోణం కాకుండా అభివృద్ధి కోణంలో దృష్టి సారించాలన్నారు.

నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరిన పీఆర్, ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతుకు నిధుల సేకరణ కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, ఇందులో అధికారుల పాత్ర క్రియాశీలకంగా ఉండాలని కోరారు. గత ప్రభుత్వం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కెనాల్ పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించి రైతులకు సాగు నీరందించడానికి కృషి చేయాలన్నారు.

నియోజకవర్గ అభివృద్ధిపై, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగాముందుకెళ్లాలని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ లో ముంపుకు గురైన రైతుల భూములకు, కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇచ్చేందుకు అధికారులు పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎంపీపీ కొత్త పుష్పలత, మున్సిపల్ చెర్ పర్సన్ గన్నె వనితా, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News