నిమ్జ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి : సంగారెడ్డి కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటు కోసం అవసరమైన

Update: 2025-03-18 13:57 GMT
నిమ్జ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి : సంగారెడ్డి కలెక్టర్
  • whatsapp icon

దిశ, సంగారెడ్డి : జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటు కోసం అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డీవో, తహసీల్దార్ లతో కలెక్టర్ నిమ్జ్ భూసేకరణ పై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్ నియోజకవర్గాల రూపురేఖలు మారిపోతాయి అన్నారు. నిమ్జ్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు.

ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నిమ్జ్ ఏర్పాటుకు భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై ఆయా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఆయా మండలాల్లో గ్రామాల వారీగా చేసిన భూసేకరణ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎంత సేకరణ చేయాల్సి ఉంది అన్న వివరాలను కలెక్టర్ ఆయా మండలాల రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పనులు వేగవంతంగా చేసి నిమ్జ్ ప్రాజెక్టు సకాలంలో ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఆర్డీవో రామ్ రెడ్డి, తహసీల్దార్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Similar News