అంగరంగ వైభవంగా లక్ష్మీ నృసింహుని కళ్యాణం..

దేవదేవుడు కొలువైన నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రం కల్యాణ శోభతో

Update: 2025-03-22 05:16 GMT
అంగరంగ వైభవంగా లక్ష్మీ నృసింహుని కళ్యాణం..
  • whatsapp icon

దిశ,వర్గల్: దేవదేవుడు కొలువైన నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రం కల్యాణ శోభతో అలరారింది. ముక్కోటి దేవతల సాక్షిగా నృసింహస్వామి వారు, లక్ష్మీ అమ్మవారు ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి సుముహూర్త వేళ స్వామివారు, అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి విశ్వనాథ్ శర్మ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అర్చక, వేద పండితులు, రుత్వికుల వేద మంత్రోచ్ఛరణల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవం తీర్ధ జనులలో భక్తిపారవశ్యం నింపింది.

ఆధ్యాత్మికతలు పంచుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి 10 గంటలకు అర్చక వేదపండితులు స్వామి వారి కల్యాణోత్సవ క్రతువుకు శ్రీకారం చుట్టారు. కాగా అర్ధరాత్రి 1 గంట వరకు స్వామివారి కల్యాణం కొనసాగింది. శ్రీనృసింహస్వామివారికి, అమ్మవారికి ఎదుర్కోళ్ళు నిర్వహించారు. యజ్ఞోపవిత ధారణ, కంకణ ధారణ జరిపారు. సుముహుర్తానికి భక్తుల హర్షధ్వానాలతో నాచగిరులు ప్రతిధ్వనిస్తుండగా ముక్కోటి దేవతల సాక్షిగా శ్రీనృసింహస్వామివారు, అమ్మవారికి మంగళ సూత్రధారణ చేశారు. వివిధ ప్రాంతాల భక్తులు కమనీయంగా సాగిన స్వామివారి కళ్యాణ తిలకించి తరించారు.కల్యాణానికి మేము సైతం అన్నట్లు కురిసిన వర్షపు జల్లులు క్షేత్రాన్ని తడిపేశాయి.


Similar News