గజ్వేల్ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే
సొంత గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు కేసీఆర్ కు పట్టడంలేదంటూ

దిశ, వర్గల్: సొంత గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు కేసీఆర్ కు పట్టడంలేదంటూ యూత్ కాంగ్రెస్, డీసీసీ ఆధ్వర్యంలో పోరుబాట చేపట్టారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైన పోరుబాట శనివారం గౌరారం చేరుకుంది. డీసీసీ అధ్యక్షుడు నర్సా రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో రాజ్ భవన్ వరకు నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ను మూడు సార్లు గజ్వేల్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ ప్రజలపై ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి గజ్వేల్ కు ఒక్కసారి కూడా రాకుండా ప్రజా సమస్యలపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. నర్సారెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్ కు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాల్సి ఉండగా ఫాంహౌస్ ఉంటూ రాజకీయం చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిగా గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ స్థానిక ప్రజలకు పదేళ్లలో ఎంతమేరకు న్యాయం చేశారో చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.