ఖనిజాభివృద్ధి తో దేశాభివృద్ధి : డిప్యుటీ సీఎం భట్టి
భారతదేశ నేలలో ఎన్నో అద్భుతమైన ఖనిజాలు దాగి
దిశ,సంగారెడ్డి అర్బన్ : భారతదేశ నేలలో ఎన్నో అద్భుతమైన ఖనిజాలు దాగి ఉన్నాయని, వాటిని గుర్తించి దేశ అభివృద్ధికి తోడ్పడేలా ఆస్ట్రేలియా దేశంతో పరస్పర ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషదాయకమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ వేదికగా ఇండియా - ఆస్ట్రేలియా క్రిటికల్ మినరల్స్ పేరిట నిర్వహించే రెండు రోజుల వర్క్ షాప్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
నెహ్రూ ఆలోచనలతోనే ఐఐటీల స్థాపన..
దివంగత మాజీ ప్రధాని నెహ్రూ ఆలోచనలతోనే దేశంలో మొట్ట మొదటిసారిగా ఐఐటీని ఏర్పాటు చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేశారు. 1951 లో ఖరగ్పూర్ లో మొదటి ఐఐటీ స్థాపనకు నెహ్రూ సహకారంతో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అలా అప్పటి నుంచి దేశంలో ఐఐటీలు విస్తరించాయన్నారు. ఇకపోతే సంగారెడ్డి జిల్లాలో ఐఐటి స్థాపనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సహకారం ఎన్నటికీ మరువలేనిదని ఆయన మరోసారి గుర్తు చేశారు. సరికొత్త పరిశోధనలకు ఐఐటీలు వేదికగా నిలవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. అయితే ఐఐటి హైదరాబాద్ కేవలం ఒక విద్యా క్యాంపస్ మాత్రమే కాదని ఇది లైట్ ఆఫ్ ఇన్నోవేషన్ అని ఆయన కొనియాడారు.
క్లిష్టమైన ఖనిజాలతో దేశం మరింత అభివృద్ధి..
ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదు దేశ నిర్మాణానికి వేదికలు. ఐఐటి హైదరాబాద్ లో ఇప్పటివరకు 11,500 పరిశోధన ప్రచురణలు, 320 పైగా పేటెంట్లు మరియు స్టార్టప్పుల ద్వారా 1500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గొప్ప మార్పుగా మేము చూస్తున్నాం ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ కింద మోనాష్ యూనివర్సిటీ సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు కేవలం తెలంగాణకే కాదు భారతదేశానికే కాదు ప్రపంచానికే కీలకం. తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించడంలో ఈ వర్క్ షాప్ సహకార స్ఫూర్తి కి అద్దం పడుతుంది. తెలంగాణలో క్లిష్టమైన ఖనిజాలను వెలికి తీసేందుకు సమర్థవంతమైన మార్గాలు కనుగొనడం, స్థిరమైన మైనింగ్ పద్ధతులు అవసరమని మేము గుర్తించాము అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పరిశోధన, వాటి సంబంధిత సైన్స్ ఆధార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని నష్టం చేశారు.
సోలార్ పవర్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, ప్రతి ఎలక్ట్రిక్ వాహనం, విద్యుత్తు నిల్వ బ్యాటరీలు వంటివి క్లిష్టమైన ఖనిజాల ద్వారానే నిర్మాణం అవుతాయన్నారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతున్నట్లు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్తు ఇంధనం గా భావిస్తున్నామని, ఆవిష్కరణల ప్రోత్సాహానికి సుస్థిరతకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా దేశ ప్రతినిధుల తో పాటు, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ జాయింట్ సెక్రటరీ దినేష్ మహతి, సింగరేణి సిఎండి బలరాం నాయక్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీ.ఎస్.మూర్తి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.