క్యాన్సర్ హబ్‌గా ఎంఎన్‌జే హాస్పిటల్..: మంత్రి దామోదర రాజనర్సింహ

ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు ఐదు క్యాన్సర్ సెక్టార్

Update: 2024-10-24 11:08 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు ఐదు క్యాన్సర్ సెక్టార్ లు ఏర్పాటు చేసి ఎంఎన్ జే హాస్పిటల్ ను హబ్ గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన మెడికల్ కళాశాల తరగతుల ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జి మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నాలుగు వ్యాధులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెప్పారు.

అందులో డయాబెటిస్, క్యాన్సర్, బీపీ, గుండె సంబంధిత వ్యాదులేనన్నారు. వీటి పై గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మూఢనమ్మకాల అపోహలో రోగం గుర్తించడం ఆలస్యం కావడం ప్రాణాల ప్రాణాల మీదకు వస్తుందని, మూడో స్టేజ్ లో వ్యాధిని గుర్తించిన ప్రయోజనం ఉండటం లేదన్నారు. ఇందు కోసం క్యాన్సర్ కోసం ప్రతి జిల్లాలో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు తో పాటు రాష్ట్రంలో ఐదు క్యాన్సర్ సెక్టార్ లు ఏర్పాటు చేసి ఎం ఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిని హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు.మొదటి గంట వైద్యం ప్రదానం అనే ఉద్దేశ్యం తో రాష్ట్రంలో 74 ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాల్లో, ప్రతి మండల స్థాయిలో వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రణాళిక ప్రభుత్వం రూపొందిస్తుందని అన్నారు. పది నెలల పదవీ కాలంలో మెదక్ మెడికల్ కళాశాల తనకు మేజర్ సబ్జెక్టుగా మారిందన్నారు.

మెడికల్ కళాశాల ఏర్పాటు లో కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల మూలంగా కళాశాల మంజూరు కోసం ఎమ్మెల్యే, ఎంపీల సహకారం తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కృషి తో మెదక్ కళాశాల వచ్చిందని తెలిపారు. రెండవ విడతలో జిల్లా కు మెడికల్ కళాశాల రావడం సంతోషం కలిగిందన్నారు. రాజకీయం, వైద్యం రెండు సామాన్య ప్రజల సేవ కోసమే అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా జిల్లా మెడికల్ కళాశాలలో 220 పడకల విస్తరణ తో పాటు వచ్చే యేడు నుంచి మెదక్ మెడికల్ కళాశాల లో పారా మెడికల్, నర్సింగ్ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

వైద్య వృత్తి నిరంతరం నేర్చుకోవడమే : మంత్రి కొండా సురేఖ

వైద్య వృత్తి అంటేనే నిరంతరం నేర్చుకుంటేనే ముందుకు సాగుతారని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ లో ఏర్పాటైన నూతన వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇతరులు ఇది చదివినా ఎందులో వెళ్తారో తెలీదని, కానీ వైద్య విద్య చదివిన వారు మాత్రం అదే వృత్తిలో ఉంటారని అన్నారు. మెదక్ కళాశాల నుంచి వైద్యుల ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందని, నాలుగేళ్లలో ఇక్కడి నుంచి వైద్యులు తయారు అవుతారని చెప్పారు. మెడికల్ కళాశాలకు అవసరమైన నర్సింగ్, పారా మెడికల్ కళాశాల మంజూరు చేయాలనీ మంత్రిని కోరారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా బాగా చదివి వారి ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు.

కేంద్రం కృషి తో నూతన కళాశాలలు: ఎంపీ రఘునందన్ రావు

సామాన్యులకు వైద్యం అందుబాటులోకి రావాలన్న ఉద్దేశ్యం తో కేంద్రం 387 కొత్త మెడికల్ కళాశాలు మంజూరు చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంగా ఉన్న ప్రగతిలో పూర్తిగా వెనకండిందన్నారు. మెదక్ మెడికల్ కళాశాల రావడం సంతోషకరమని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో 10,7000 సీట్ల ఎంబిబిఎస్ సీట్ల వరకు పెంచిందని చెప్పారు. మెడికల్ కళాశాలకు అవసరమైన అధునాతన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

నర్సింగ్, పారా మెడికల్ కళాశాల మంజురికి కోసం సీఎం దృష్టికి : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

మెదక్ మెడికల్ కళాశాల కు నర్సింగ్, పారా మెడికల్ కళాశాల మంజూరు చేయాలని కోరడం వల్లనే మంజూరు వచ్చినట్లు ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ జిల్లా గ్రామీణ ప్రాంతం కలిగిన జిల్లా కావడం వల్ల మెడికల్ కళాశాల తో పేదలకు సైతం ప్రయోజనం కలుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి తో పాటు మంత్రి, జిల్లా యంత్రాంగం చేసిన కృషి వల్ల మెడికల్ కళాశాల మంజూరు చేయించుకోగలిగామని తెలిపారు. రాబోయే రోజుల్లో అధునాతన సౌకర్యాలు కల్పించి జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేమని చెప్పారు.

గత ప్రభుత్వం ఎంతో కృషి చేసింది: ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి

రాష్ట్రంలో మెడికల్ కళాశాల మంజూరు కోసం గత ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం అందరి కృషి కూడా ఉందని తెలిపారు. వచ్చి మెడికల్ కళాశాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఏ ప్రభుత్వం పథకాలు తీసుకు వచ్చిన ప్రధాన ఉద్దేశ్యం మాత్రం ప్రజల కోసం సేవ చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధన్ రెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ప్రిన్సిపాల్ రవి కుమార్, శివ దయాల్ తో పాటు నేతలు, అధికారులు పాల్గొన్నారు.


Similar News