హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Update: 2024-10-02 15:24 GMT

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ జంక్షన్ సుందరీకరణ కు శంఖు స్థాపన చేశారు. వికలాంగులకు స్కూటీ లను అందజేశారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సమీపంలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటును మంత్రి ప్రారంభించారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సమీపంలో ప్రియదర్ గ్రీన్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎకరం స్థలంలో ఒక కోటి పది లక్షల వ్యయంతో నిర్మించిన మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటును ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్లాంట్ ను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించడం చాలా గర్వ కారణంగా ఉందని అన్నారు. ప్లాంట్ లోపల మొక్కలు పెంచి ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని సూచించారు. నిండిన సెప్టిక్ ట్యాంక్ లోని వ్యర్థాలతో ఎరువులు తయారు చేయడమే ఈ శుద్ధీకరణ ప్లాంట్ లక్ష్యమని తెలిపారు.

మానవ వ్యర్థాల నుంచి సాంకేతికంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఎటువంటి మందులు కలపకుండా ప్రకృతి విధానంలో పరిశుభ్రంగా చేసేలా ఎఫ్ ఎస్ టీ పీ ని ప్రారంభించుకున్నామని అన్నారు. మానవ మల వ్యర్థాలు ఘన రూపంలో, ద్రవ రూపంలో ఉండవని ఇక్కడ ఎలాంటి వాసన రాదని తెలిపారు. బయట వాతావరణం అపరిశుభ్రం అవుతుందని అపోహలు వద్దని పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎల్లమ్మ చెరువు పక్కనే ఇంకా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈ ప్రాంతమంతా హుస్నాబాద్ కేంద్రంగా టూరిజం అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణానికి అవసరమైన వ్యర్థాలతో ఎరువులు ఇచ్చే విధంగా శుద్ధి చేసుకొని ఎఫ్ ఎస్ టీ పీ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు ఒక సేవకులుగా నగర ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్నారని వారిని అభినందించారు.

ప్రజలకు శుభ్రత పట్ల అవగాహన లేక మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది శ్రమపడుతున్నారనీ 113 మంది మహిళలకు చీరలు, సిబ్బందికి బట్టలు అందజేశారు. అనంతరం ఎల్లమ్మ చెరువు కట్టపై ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రకృతిని ప్రేమిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ చిత్తారి పద్మ , ప్రాజెక్ట్ ఆఫీసర్ రవికుమార్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Similar News