ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భూమి పూజ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ హుస్నాబాద్ రావడంతో నియోజకవర్గం విద్యా రంగంలో మరింత ముందుకు పోతుందని, తన నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్‌గా మారాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Update: 2024-10-11 06:13 GMT

దిశ, కోహెడ: అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ హుస్నాబాద్ రావడంతో నియోజకవర్గం విద్యా రంగంలో మరింత ముందుకు పోతుందని, తన నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్‌గా మారాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో తంగలపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కాంప్లెక్స్‌కు భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడిగా మీ అందరి ఆశీర్వాదం తో హుస్నాబాద్ ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యాను. విద్యా, వైద్యం, టూరిజం, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి కల్పన అన్నిటిపై దృష్టి సారించాం. జీవో 190 ద్వారా నాలుగు గురుకులాలు ఒకే కాంప్లెక్స్‌గా విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ఏర్పాటు చేశాం. నాలుగో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకునేలా భవనాల నిర్మాణం జరుగుతుంది.

విద్యా శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్నప్పటికీ వివిధ విద్యా కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామిని అయ్యాను. రాష్ట్రంలో 25 వేల పాఠశాలలకు 1100 కోట్లతో మౌలిక వసతులు కల్పించాం. స్కూల్‌లకి ఉచిత విద్యుత్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ సిబ్బందికి జీతాలు పై ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు 19 వేల ప్రమోషన్‌లు, 35 వేల బదిలీలు చేశాం. డీఎస్సీ ద్వారా 10 వేల మందికి నియామక పత్రాలు అందించాం. గురుకులాల్లో మెస్ బకాయిలు చెల్లించడం తో పాటు, అద్దె బకాయిలు కూడా చెల్లిస్తున్నాం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆలోచనతో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు ఏర్పాటు అవుతున్నాయి.

మన జిల్లాకు నాలుగు స్కూల్స్ వస్తున్నాయి. 5 వేల కోట్లతో ఈ పాఠశాలల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల నిర్మాణం జరుగుతుంది. 180 కోట్లతో ఒక్కో పాఠశాల నిర్మాణం జరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నమూనాలను వీడియో రూపంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చూపించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో, ఎమ్మార్వో, మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, నాయకులు బసవరాజ్ శంకర్, శెట్టి సుధాకర్, భీమ్ రెడ్డి మల్లారెడ్డి, బోయిని జయరాజ్, చింతకింది శంకర్, గొరీట్యాల లక్ష్మణ్, పిల్లి రాజయ్య, పాము శ్రీకాంత్, అబ్దుల్ రఫీ, భీమ్ రెడ్డి తిరుపతి రెడ్డి, బందెల బాలకిషన్, వేల్పుల వెంకటస్వామి, అధికారులు పాల్గొన్నారు.


Similar News