శనిగరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి..

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి, సోమవారం రాష్ట్ర రవాణా శాఖ, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటించారు.

Update: 2024-09-23 11:26 GMT

దిశ, కోహెడ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి, సోమవారం రాష్ట్ర రవాణా శాఖ, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటించారు. శనిగరం చెరువును పరిశీలించి చెరువులో గంగమ్మకి పసుపు, కుంకుమ పూలు వేసి పూజలు చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చిన గ్రామప్రజలు గుట్ట నుంచి వరద నీరు గ్రామంలోకి, హాస్టల్ లోకి వస్తుందని తెలిపారు. గుట్ట నుంచి వచ్చే నీటిని ప్రొక్లెయిన్ ద్వారా డ్రెయిన్ సిస్టమ్ ద్వారా పంపించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బీసీ హాస్టల్ ను సందర్శించి వారికి అందుతున్న ఆహారం, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో బోర్ కావాలని, టాయిలెట్స్ ఇబ్బంది ఉన్నదని చెప్పడంతో హాస్టల్ లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి అధికారులు ఆదేశించారు. తంగలపల్లిలో డబుల్ రోడ్డు పనులకు విద్యుత్ స్తంభాలు షిఫ్టడ్ కోసం ఇప్పటికే రూ.5 లక్షలు మంజూరు చేసినప్పటికీ పనుల అలస్యం పై అధికారులను వివరణ కోరారు. పోల్స్ త్వరగా షిఫ్ట్ చేసి రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కోహెడ మండలంలో పలు రోడ్ల నిర్మాణానికి రూ.482.48 లక్షల నిధుల మంజూరు అయ్యాయని అన్నారు.

గోట్లమిట్ట - నారాయణపూర్ మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 91.55 లక్షలు మంజూరు. కోహెడ - మైసంపల్లి (వయా షేర్ అలీ నగర్, సీసీ పల్లి ,కచాపూర్) రూ.57.00 లక్షలు మంజూరు. పీడబ్ల్యుడీ రోడ్డు నుంచి బస్వాపూర్ - కోహెడ (వయ ధర్మసాగర్ పల్లి, మోతిరం తండ, చంద్రనాయక్ తండా, ఆరేపల్లి) బీటీ రోడ్డు రెన్యువల్ కోసం రూ. 281. 83 లక్షలు, నారాయణపూర్ - శ్రీరాములపల్లి బీటీ రోడ్డు రెన్యువల్ కోసం రూ. 52.10 లక్షలు మంజూరు చేశామని అన్నారు.

పల్లికాయ సబ్సిడీ రాలేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య, బసవరాజ్ శంకర్, శెట్టి సుధాకర్, కర్ర రవీందర్, గోరిట్యాల లక్ష్మణ్, చింతకింది శంకర్, బోయనీ జయరాజ్, భీమ్ రెడ్డి తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మార్వో సురేఖ, ఎంపీడీవో కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Similar News