రాష్ట్రానికి సిద్దిపేట దిక్సూచి.. మంత్రి కేటీఆర్
అభివృద్ధిలో.. దేశానికి తెలంగాణ దిక్సూచి అయితే.. తెలంగాణ రాష్ట్రానికి సిద్దిపేట దిక్సూచి అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : అభివృద్ధిలో.. దేశానికి తెలంగాణ దిక్సూచి అయితే.. తెలంగాణ రాష్ట్రానికి సిద్దిపేట దిక్సూచి అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. సిద్దిపేట పట్టణ శివారు నాగుల బండలో రూ. 63 కోట్ల నిర్మించిన ఐటీ టవర్ ను మంత్రి తన్నీరు హరీష్ రావు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ మోడల్ అంటే అన్ని రంగాలలో సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్యగా అభివృద్ధి చేయడం అని నిర్వచించారు. ఐటీ, వ్యవసాయ ఎగుమతులల్లో రాష్ట్రం దూసుకపోతుందన్నారు. 3 శాతం జనాభా ఉన్న రాష్ర్టానికి 30 శాతం అవార్డులు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకత్వానకి అండగా నిలచి ఉద్యమానికి స్పూర్తి నిచ్చింది సిద్దిపేట ప్రజలే అని కొనియాడారు.
మిషన్ భగీరథ, హరిత హారం, కల్యాణలక్ష్మీ, దళిత బందు పథకాలను నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ పనిచేసినప్పుడు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అచరిస్తే.. దేశం అనుసరిస్తోందన్నారు. తెలంగాణలోని ప్రతి నియోజక వర్గం సిద్దిపేట మాదిరి మారిన నాడు బంగారు తెలంగాణ నిర్మాణమైనట్లు అని స్పష్టం చేశారు. ఐటీ టవర్ విస్తరణ, టీహబ్ ఏర్పాటుకు హామీ నిచ్చారు. టాస్క్ నైపుణ్య శిక్షణను యువత సద్వినియోగ పరుచుకోవాలన్నారు. 2014లో ఐటీ రంగంలో 56వేల కోట్ల ఎగుమతులుంటే, నేడు 2,41,000 కోట్ల ఎగుమతులు సాధించడంతో పాటుగా ఉద్యోగుల సంఖ్య 3,23,000 నుండి 9,00,5000 పెరిగారన్నారు. వర్గల్ పుడ్ ప్రాసిసింగ్ పరిశ్రమ, మందపల్లి పారిశ్రామిక వాడలల్లో వేల మందికి ఉపాధి ఉద్యోగాల సృష్టికి కృషి చేస్తా అన్నారు. స్వచ్చబడిని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అభివృద్ధి కాముకుడు మంత్రి తన్నీరు హరీష్ రావు ను గత మెజార్టీ బదలు కొట్టి లక్ష 50వేల రికార్డు మెజార్టీతో గెలుపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న సీఎం కేసీఆర్ ను ముచ్చటగా మడోసారి సీఎంగా అశీర్వదించాలని కోరారు.
తిట్టినోళ్లే.. మెచ్చుకుంటుడ్రు.. మంత్రి హరీష్ రావు
రాష్ట్రం ఏర్పాటైన కొత్తలల్లో మతకల్లోలాలు, కరెంటు కోతలు ఉంటాయని అన్న నాయకులే నేడు మెచ్చుకుంటున్నారని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వంత రాష్ర్టంలో నేడు పవర్ హాలిడేలు, అస్సాంలో కరెంట్ కోతలుంటే తెలంగాణ వ్యవసాయం 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటుగా, ఇంటింటి, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం కేసీఆర్ నాడు ప్రకటిస్తే కాంగ్రెస్ నేత జానారెడ్డి ఎట్ల సాధ్యమైతోందని ప్రశ్నించారని గుర్తు చేశారు. విజన్ 2020, హైటెక్ పాలనలో జరగని పనులు సీఎం కేసీఆర్ సారధ్యంలో సాధించుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వం రాష్ట్రంలో ఉండటం మన అందరికి అదృష్టం అన్నారు.
సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటుకోసం మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఇతర రాష్ట్రాల ప్రజలు వచ్చి చూసి మెచ్చుకుంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పనకు కృషి చేస్తా అన్నారు. స్థానిక విద్యార్థులకు ఐటీటవర్ లో ఉద్యోగాలు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కప్పుడు ఎన్నికల నినాదాలైన గోదావరి నీళ్లు, సిద్దిపేట జిల్లా, రైలును సిద్దిపేటకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. కోమటి చెరువు సుంధరీకరణ, రింగ్ రోడ్డు, తాగునీరు ఇలా సిద్దిపేట అభివృద్ధికి సీఎం కేసీఆర్ బలమైన పునాదులు వేశారని, నేడు తాను కేవలం విస్తరించామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఐటి శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, దేశిపతి శ్రీనివాస్, టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యేలు వోడితల సతీష్ కుమార్, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గ్రంధాలయం సంస్థ చైర్మన్ ఎల్.ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.