కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుంది :టీపీసీసీ చీఫ్

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ రిపేర్లు చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

Update: 2024-11-18 11:07 GMT

దిశ, సంగారెడ్డి /కొండాపూర్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ రిపేర్లు చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… గత 10 ఏండ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేశాడని, బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు మయం అయ్యిందని ఆరోపించారు. 70 ఏండ్ల క్రితం కట్టిన నాగార్జున సాగర్, తుంగభద్ర, బాక్రానంగల్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కడితే ఇప్పటి వరకు చెక్కు చెదరలేదన్నారు. కానీ కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం పూర్తిగా బీటలు వారిందని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రూ.18వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేశామని వివరించారు. అదే విధంగా త్వరలో రైతు బంధు పథకం కూడా అమలు చేస్తామని ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రూ.56వేల కోట్లు అప్పు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ రాష్ట్రంలో రూ.8లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. నెలకు వారు చేసిన అప్పుకు రూ.10వేల కోట్ల వడ్డీ కడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడితే కేసీఆర్ 10 ఏండ్లలో 50 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో 55 వేల ఉద్యోగాల కల్పించామని తెలిపారు. మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి..మేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామని హరీష్ రావు చర్చకు సిద్ధమా..అని సవాల్ విసిరారు. మన ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం..అవన్నీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు వివరించాలని సూచించారు. జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదని, హారీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడని, చివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరని జోష్యం చెప్పారు.

ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి దామోదర రాజనర్సింహా


దేశంలో చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తుందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 60 ఏళ్ల సుదీర్ఘ ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం కోసం సోనియాగాంధీ గుర్తించి రాష్ట్రం ఇచ్చిందన్నారు. కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మీ పథకానికి రూ.3600 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోటి 10 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారన్నారు. అదే విధంగా 46 లక్షల మందికి ఉచిత కరెంట్, గ్యాస్ పథకం అందించామని తెలిపారు. నాడు ప్రతి పేదవాడికి వ్యవసాయ భూమి, ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కులగణన జరగాలి అందరికీ సంక్షేమ పథకాలు అందాలని ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వైద్య సేవలు అందించేందుకు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చాడని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 1375 రకాల చికిత్సల కోసం ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ కచ్చితంగా అమలు చేసి తీరుతామని, ఇప్పటి వరకు 54 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వచ్చే ఏ ఎన్నికలయిన కాంగ్రెస్ పార్టీనే గెలిచే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీ నిర్మలాజగ్గారెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కార్పోరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, నీలం మధు ముదిరాజ్, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, తోపాజీ అనంతకిషన్, ఆంజనేయులు, కూన సంతోష్ కుమార్, షపీ వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


Similar News