అమీన్ పూర్ లో మళ్ళీ హైడ్రా కూల్చివేతలు..
అమీన్ పూర్ లో అక్రమ కట్టడాల పై మళ్ళీ హైడ్రా పంజా విసిరింది. వందనపురి కాలనీ సర్వేనెంబర్ 848లో రోడ్డున ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదు పై కొరడా జూలిపించింది.
దిశ, పటాన్ చెరు : అమీన్ పూర్ లో అక్రమ కట్టడాల పై మళ్ళీ హైడ్రా పంజా విసిరింది. వందనపురి కాలనీ సర్వేనెంబర్ 848లో రోడ్డున ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదు పై కొరడా జూలిపించింది. కాలనీవాసుల ఫిర్యాదుతో సోమవారం తెల్లవారుజామునే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని ప్రోక్లైనర్ల సహాయంతో తొలగించేశారు. కాలనీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు తో హైడ్రా చర్యలు తీసుకుంది.
ఈ సందర్భంగా కాలనీ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ వందనపురి కాలనీ పరిధిలోని పెద్ద ఎత్తున రోడ్లను కబ్జా చేసి నిర్మాణాలను చేపడుతున్నారని వాపోయారు. గత 12 సంవత్సరాలుగా ఈ అక్రమ నిర్మాణాల పై పోరాటం చేస్తున్నామని తెలిపారు. గతంలో మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. రోడ్డును కబ్జా చేసి నిర్మాణం చేస్తున్న వ్యక్తుల పై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు కోర్టులో తేల్చుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చారని విమర్శించారు. కానీ హైడ్రాకు ఫిర్యాదు చేసిన రోజుల వ్యవధిలోనే రోడ్డు పై అక్రమ నిర్మాణాలను తొలగించడం అభినందనీయమన్నారు.