అభివృద్ధిలో మెదక్ దూసుకెళ్తోంది: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ జిల్లా నూతనంగా ఏర్పడిన తరువాత అభివృద్ధిలో దూసుకెళ్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు

Update: 2023-02-28 14:18 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా నూతనంగా ఏర్పడిన తరువాత అభివృద్ధిలో దూసుకెళ్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. విశాలమైన రహదారులతో పాటు, రహదారులకు ఇరువైపులా మొక్కలతో మెదక్ పట్టణాన్ని సుందరీకరిస్తున్నామని, త్వరలో రూ. 10 కోట్ల వ్యయంతో గోసముద్రాన్ని సుందరీకరిస్తూ ఆహ్లాదకర వాతావరాణాన్ని కల్పించేలా పార్కులు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్ అధ్యక్షతన జరిగిన 2023-24 సంవత్సరపు మునిసిపల్ బడ్జెట్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మునిసిపల్ కమిషనర్ జానకి రాంసాగర్ లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రూ. 20 కోట్ల 51 లక్షల 89 వేలతో రూపొందించిన 2023-24సంవత్సరపు అంచనా బడ్జెట్ ను ఆమోదిస్తూ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి త్వరలో రానున్న రాష్ట్ర సీఎం కేసీఆర్ మరిన్ని నిధులు మంజూరు చేసే అవకాశమున్నందున బడ్జెట్ అంచనాలను మరో రూ. 10 కోట్లు పెంచుతూ ఆమోదించుటకు సమావేశం తీర్మానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 27 కోట్ల 2 లక్షల నుంచి రూ. 16 కోట్ల 68 లక్షల 81 వేలకు సవరించిన బడ్జెట్ కు సభ ఆమోదం తెలిపింది. ఇందులో ఆస్తిపన్ను, అసైన్డ్ రెవిన్యూ ద్వారా రూ. 6 కోట్ల 64 లక్షలు, అద్దెలు, టౌన్ ప్లానింగ్, సానిటిషస్, ఇంజనీరింగ్ తదితర పన్నేతర వనరుల మార్గాల ద్వారా రూ. 6 కోట్ల 13 లక్షల 89 వేలు, డిపాజిట్లు, అడ్వాన్స్ ల ద్వారా రూ. 24 లక్షలు, నాన్ ప్లాన్, ప్లాన్ , ఇతర గ్రాంటుల ద్వారా రూ. 7 కోట్ల 50 లక్షలు వస్తాయని అంచనా వేశామని ఎమ్మెల్యే తెలిపారు.

కాగా ఇందులో వేతనాలు, పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ హరితహారం కార్యక్రమాలకు రూ. 8 కోట్ల 24 లక్షల 33 వేలు ఖర్చు చేయుటకు ప్రతిపాదించామన్నారు. ఇంజనీరింగ్, పరిపాలన, టౌన్ ప్లానింగ్ విభాగాల నిర్వహణకు రూ. కోటి 56 లక్షల 23 వేలు, వార్డు వారీగా, ప్రజా సౌకర్యాలు తదితర వాటికి రూ. 2 కోట్ల 92 లక్షల 32 వేలు, ప్లాన్, నాన్ ప్లాన్ తదితర గ్రాంట్ల ద్వారా రూ. 7 కోట్ల 50 లక్షలు, డిపాజిట్లు, రుణాల చెల్లింపుకు రూ. 27 లక్షలు ఖర్చు చేయనున్నామని, రూ. 2 లక్షల ఒక వేయి మిగులు బడ్జెట్ ఉంటుందని అన్నారు. వార్డు వారీగా ఏయే కార్యక్రమాలు చేపట్టాలి, ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఇవ్వాలో చర్చించడం జరిగిందని, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంలో బల్దియాను అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ వాస్తవిక బడ్జెట్ రూపొందించామని, ప్రతిపాదించిన అంచనాలకు అనుగుణంగా నిధులు సమీకరించడంతో పాటు నిర్దిష్టమైన పనులు చేపట్టి సకాలంలో ఖర్చు చేయుటలో శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ సమావేశంలో మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మునిసిపల్ కమిషనర్ జానకి రాం సాగర్, కౌన్సిలర్లు, మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News