వైభవంగా మంత్రి దామోదర్‌ కూతురు రిసెప్షన్‌

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్‌ రాజనర్సింహ కూతురు వివాహ రిసెప్షన్‌ ఆదివారం చౌటకూర్‌ మండలం తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద ఘనంగా జరిగింది.

Update: 2024-03-03 15:40 GMT

దిశ, అందోల్‌: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్‌ రాజనర్సింహ కూతురు వివాహ రిసెప్షన్‌ ఆదివారం చౌటకూర్‌ మండలం తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద ఘనంగా జరిగింది. ఈ వేడుక మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కాగా, సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. సుమారుగా 40 ఎకరాల వీస్తీర్ణంలో రిసెప్షన్‌ వేదికను ఏర్పాటు చేయగా, వాహనాల పార్కింగ్‌ కోసం మరో 35 ఎకరాలను ఏర్పాటు చేశారు. దామోదర్‌ కూతురు త్రిష– అల్లుడు మణికంఠలను ఆశీర్వదించేందుకు రాష్ట్ర నాయకులతో పాటు నియోజకవర్గానికి చెందిన రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీఐపీలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా నేరుగా రిసెప్షన్‌ వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు.

అదే విధంగా వారి కోసం ప్రత్యేకంగా భోజనం చేసేందుకు ఏసీ షెడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే ఎనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకీ దయాకర్‌, అవినాష్ గౌడ్, కాటా శ్రీనివాస్ గౌడ్, తో పాటు వివిధ పార్టీ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇప్పటివరకు అందోలు చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో వివాహ, రిసెప్షన్‌ వేడుకలను నిర్వహించిన వారే లేరంటూ అక్కడికి వచ్చిన నాయకులు చర్చించుకున్నారు.70 వేల వరకు హాజరు:

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్‌ రాజనర్సింహ కూతురు త్రిష–మణికంఠల వివాహ రిసెప్షన్‌కు సుమారుగా 70 వేల మంది వరకు హజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా నలుమూలల నుంచే కాకుండా అందోలు నియోజకవర్గంలో మండలాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రిసెప్షన్‌లో ఏలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రిసెప్షన్‌ వచ్చిన వారికి భోజనాలు చేసేందుకు ఎక్కడికక్కడ భోజన గ్యాలరీలను ఏర్పాటు చేశారు.


Similar News