సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన జగ్గారెడ్డి

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్​పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​తూర్పు జయప్రకాశ్​రెడ్డి(జగ్గారెడ్డి)

Update: 2022-03-05 10:13 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్​పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​తూర్పు జయప్రకాశ్​రెడ్డి(జగ్గారెడ్డి) సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు సీఎంను అభినందించారు. గత నెల 21న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్​శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ సభలోనే మంత్రి హరీష్​రావు అభ్యర్థన మేరకు కేసీఆర్​సంగారెడ్డి జిల్లాకు రూ.364.80కోట్ల నిధులు కేటాయించడంతో పాటు రెండు రోజుల్లోనే వాటిని విడుదల చేసిన విషయం విధితమే. ఈ నిధుల్లో సంగారెడ్డి, జహీరాబాద్​మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదల చేశారు. కాగా, శనివారం సంగారెడ్డి పట్టణంలో ప్రజలతో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మున్సిపాలిటీకి రూ.50 కోట్లు కేటాయించిన నేపథ్యంలో వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తే బాగుంటుందని ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సమావేశానికి కేవలం కాంగ్రెస్​పార్టీకి చెందిన కౌన్సిలర్లు మాత్రమే హాజరు కాగా.. అధికార టీఆర్‌ఎస్​పార్టీకి చెందిన వారు ఎవరు అటువైపే రాకపోవడం గమనార్హం. ఇది గమనించిన జగ్గారెడ్డి నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, నిధులు వచ్చేలా కృషి చేసినందుకు మంత్రి హరీష్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారానికి నిధులు వినియోగించాలని జగ్గారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో నిధులు ఇచ్చారని, వాటిని వివాదాలకు తావు లేకుండా సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి వెచ్చించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

ప్రోటోకాల్​ విధిగా అమలు చేయాలి..

ప్రోటోకాల్​విషయంలో అధికారులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జగ్గారెడ్డి సూచించారు. ప్రజా ప్రతినిధులకు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించాలని సూచించారు. ఇదిలా ఉండగా ఈనెల15న ఫిల్టర్ బెడ్ లను పరిశీలిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. అలాగే గంజి మైదాన్​మార్కెట్‌లోని షెటర్స్ లబ్ధిదారులకు కేటాయించే విషయం గురించి జాయింట్ కలెక్టర్ ను కలుస్తానని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యేగా నా సూచనలు చేస్తున్నానని, ప్రోటోకాల్ ప్రకారం అధికారులు వ్యవహరించాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు చేశామని, కంది ఐఐటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజీవ్ పార్క్, స్విమ్మింగ్ పూల్, శిల్పారామం, కల్వకుంట్ల రోడ్డు, రాజంపేట రోడ్డుతో పాటు కోట్లాది రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని జగ్గారెడ్డి గుర్తు చేశారు. మున్సిపల్ కమిషనర్​చంద్రశేఖర్, కౌన్సిలర్లు ఉదయ్, రాజు, ఆరీఫ్, రాజేందర్, వనితా సంతోష్‌లతో పట్టణ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News