అమీన్ పూర్ లో హైడ్రా విశ్వరూపం...

అమీన్ పూర్ లో హైడ్రా విశ్వరూపం చూపింది. ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకుపడింది.

Update: 2024-09-22 15:32 GMT

దిశ,పటాన్ చెరు :  అమీన్ పూర్ లో హైడ్రా విశ్వరూపం చూపింది. ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకుపడింది. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ గూడ, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలపై కొరడా ఝళిపించింది. పటేల్ గూడ సర్వే నంబర్ 6 లో అనుమతులు తీసుకొని ప్రభుత్వ సర్వే నంబర్ 12 లో ఇండ్లను నిర్మించారన్న ఆరోపణలతో హైడ్రా అధికారులు ఆ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. ఉదయం 6 గంటల నుంచి రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి 3 ప్రొక్లైనర్ల సహాయంతో భారీ పోలీసు బందోబస్తుల నడుమ కూల్చివేతలు మొదలుపెట్టారు.

మరొక పక్క కిష్టారెడ్డిపేట సర్వే నంబర్ 164 లో వెలసిన 3 అపార్ట్మెంట్ పై హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి. బాహుబలి జంబో బుల్డోజర్ సహాయంతో సర్వే నెంబర్ 164 లో నిర్మించిన భవనాలలో మొదట ఐదంతస్తుల ఆసుపత్రి భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. భారీ బుల్డోజర్ సహాయంతో పూర్తి పేక మెడల భవనాన్ని కూల్చివేశారు. అనంతరం ఆసుపత్రి పక్కనే ఉన్న మరో ఐదంతస్తుల అపార్ట్మెంట్ తో పాటు ఆరు అంతస్తుల్లో నిర్మించిన కమర్షియల్ బిల్డింగ్ ను హైడ్రా ఆధికారులు తొలగించారు.

పక్క సర్వే నెంబర్లతో అనుమతులతో ప్రభుత్వ భూమి కబ్జా..

పక్కనున్న ప్రైవేట్ సర్వే నంబర్లతో అనుమతులు తీసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇండ్లతోపాటు అపార్ట్మెంట్లను నిర్మించారని అధికారులు తేల్చారు. అమీన్ పూర్ ప్రాంతంలో ఇటువంటి తరహా అక్రమాలతో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు హైడ్రా కు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి శనివారం పూర్తి వివరాలు సేకరించారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతో ప్రభుత్వ భూముల కబ్జా విషయాన్ని నిగ్గుతేల్చారు.

పటేల్ గూడ లో ప్రైవేట్ సర్వేనెంబర్ 6 పేరుతో అనుమతులు తీసుకుని ప్రభుత్వ సర్వే నంబర్ 12 లో 26 గృహాలను నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 165,166 పేరుతో అనుమతులు తీసుకుని ప్రభుత్వ సర్వే నంబర్ 164 లో మూడు భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపట్టారని అధికారుల దృష్టికి వచ్చింది. అదేవిధంగా కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ తో ఐలాపూర్ వివాదాస్పద భూముల్లో అక్రమ భవనాలు వెలసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ తరుణంలో శనివారం ఈ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు ఆదివారం తెల్లవారుజామున 6 గంటల నుంచి కూల్చివేతలు మొదలుపెట్టారు. అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టడంతో సర్వేనెంబర్ 12 లో ఇండ్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులు అప్పటికప్పుడు తమ ఇండ్లను ఖాళీ చేసి వాహనాల్లో తమ సామాను తరలించుకున్నారు.

కోర్టు ఆదేశాలను ధిక్కరించారు: నిర్మాణదారులు


తమ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం నుంచి ఆర్డర్స్ ఉన్న అవన్నీ పక్కనపెట్టి అన్యాయంగా తమ నిర్మాణాలను కూల్చివేశారని సంబంధిత నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. తమ సమక్షంలో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిగా తేల్చకుండానే తమ నిర్మాణాలను తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక రోజు ముందే నోటీసులు జారీ చేసి ఇండ్లను ఖాళీ చేయించి కూల్చివేయడం అన్యాయమని వాపోయారు. కనీసం సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం ఈ నిర్మాణాలకు చాలాసార్లు నోటీసులు జారీ చేశామని అయినా పట్టించుకోకుండా విచ్చలవిడిగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. హైడ్రా కూల్చివేతలు చేపట్టిన భూములన్ని ప్రభుత్వ భూములేనని ఆ భూముల్లో వెలిసిన నిర్మాణాలను మాత్రమే కూల్చి వేసామని స్పష్టం చేశారు.

అనుమతులిచ్చి నిండా ముంచారు..

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టడంతో బాధితులు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. రెండేళ్ల కింద అధికారులు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతోనే నిర్మాణాలు మొదలుపెట్టినట్లు బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు మొదలుపెట్టినప్పుడు అప్పటి అధికారులు ఏం చేశారని నిలదీస్తున్నారు.

సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవడంతో పాటు తమ స్థలాలకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద కూడా రెగ్యులరైజ్ చేసుకున్నామని తెలిపారు. దానికి తోడు సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు తమ ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయడంతోనే తాము ఈ గృహాలను కొనుగోలు చేశామని కొనుగోలుదారులు తెలుపుతున్నారు. ఆ సమయంలో అక్రమాలను అరికట్టకుండా భవనాలు పూర్తయి తాము కొనుగోలు చేసిన తర్వాత కూల్చివేయడం అన్యాయమని కన్నీటి పర్యంతమవుతున్నారు. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకోవడంతో పాటు తమ వద్దన్న నగదుకు తోడు బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని గృహాలను కొనుగోలు చేశామని, ఇప్పుడు ఈ కూల్చివేతలతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. కేవలం ఒక రోజు ముందే నోటీసులు జారీ చేసి తమ ఇండ్లను ఖాళీ చేసుకునే సమయం ఇవ్వకుండా కూల్చివేత్తలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు ఉన్న విషయం తమకు తెలియకుండా ఇండ్లు కొనుగోలు చేశామన్నారు. తాము బాధితులం మాత్రమేనని, ఈ ప్రభుత్వ భూములను అక్రమంగా ఖాళీ స్థలాలను ప్లాట్లుగా విక్రయించిన వారిపైన, నిర్మాణాలు చేసి ఇండ్ల నమ్మిన సూత్రధారుల పైన వీటికి అనుమతులు ఇవ్వడంతో పాటు ఈ నిర్మాణాలకు సహకరించిన అన్ని శాఖల పాత్ర ధారుల పైన చర్యలేవని నిలదీశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకొని తమకు అందరికీ న్యాయం చేయాలని విన్నవించుకున్నారు.


Similar News