బంగారం షాపులో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్..
జల్సాలకు అలవాటు పడి సిద్దిపేట పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: జల్సాలకు అలవాటు పడి సిద్దిపేట పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం మద్దిలపాలెం కు చెందిన వేపంచ షణ్ముఖ రెడ్డి జల్సాలు చేయడానికి డబ్బుల కోసం బంగారం దుకాణంలో దొంగతనం చేసి అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ నుంచి స్నేహితుడి మోటారు సైకిల్ పై ఈ 18న సిద్దిపేట కు వచ్చాడు. లాల్ కమాన్ సమీపంలోని నయీం మియా బంగారం షాపులోకి వెళ్లి అధిక బరువు గల బంగారు చైన్లు చూపించాలని కోరాడు. ఒక ట్రే లో 5 బంగారు చైన్లు చూపించగా ట్రే తో సహ బంగారు చైన్లు తీసుకొని పరిగెత్తి పక్క సందులో పెట్టిన మోటార్ సైకిల్ పై హైదరాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో టోల్ గేట్ వద్ద బైక్ నుంచి పడిపోయాడు.
ప్రథమ చికిత్స అనంతరం ప్రజ్ఞాపూర్ వద్ద పార్కింగ్ సెంటర్ లో బైక్ పెట్టి బస్సులో హైదరాబాద్ వెళ్లి పోయాడు. ఈనెల 21న దొంగిలించిన బంగారం కరీంనగర్ లో అమ్మకం కోసం ప్రజ్ఞాపూర్ లో పార్కింగ్ చేసిన బైక్ తీసుకొని వెళ్తున్న క్రమంలో రంగీలా దాబా చౌరస్తా వద్ద పోలీసులను చూసి నిందితుడు పారి పోవడానికి యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించగా బంగారం, చైన్లు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద 5 బంగారు చైన్లు (8 తులాలు), బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఎస్ఐ వెంకట్ రెడ్డి, సిబ్బంది సుధాకర్ రెడ్డి, ప్రశాంత్, యాదగిరి, ప్రవీణ్ లను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అభినందించి రివార్డు అందజేస్తానని తెలిపినట్లు ఏసీపీ పేర్కొన్నారు.