సర్కారు స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా..

ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. సర్కార్ జాగలను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలపై విరుచుకుపడింది.

Update: 2024-09-22 08:49 GMT

దిశ, పటాన్ చెరు: ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. సర్కార్ జాగలను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలపై విరుచుకుపడింది. శనివారం ఈ అక్రమ నిర్మాణాలను పరిశీలించిన హైడ్రా బృందం ఆదివారం తెల్లవారుజామున ఆరు గంటలకు స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి రంగంలోకి దిగింది. భారీ మెషిన్లు, జేసీబీల సహాయంతో కూల్చివేతలు మొదలుపెట్టింది. పటేల్ గూడా సర్వే నెంబర్ 12 లో వెలసిన ఇండ్లతో పాటు, కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 164 లో మూడు భారీ అపార్ట్మెంట్లలో అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. అదేవిధంగా కిష్టారెడ్డిపేట శ్రీరామ్ నగర్ కాలనీలో వివాదాస్పద భూముల్లో వెలసిన అపార్ట్ మెంట్ లను సైతం కూల్చేస్తారని సమాచారం. సర్వే నెంబర్ 12 లో నిర్మాణాలపై కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని నిర్మాణదారులు చూపించే ప్రయత్నం చేసిన ప్రభుత్వ సర్వే నెంబర్ లో నిర్మాణాలకు, ఆ ఉత్తర్వులకు సంబంధం లేదని తోసిపుచ్చుతూ కూల్చివేతలు మొదలుపెట్టారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Similar News