మమ్మేలు మాయమ్మ.. ఏడుపాయల వనదుర్గమ్మ

వాగులు, వంకలు.. కొండలు, కోనలు.. దాటి వచ్చిన భక్తజనంతో ఆదివారం ఏడుపాయల వనం జనారణ్యమైంది.

Update: 2024-09-22 09:26 GMT

దిశ, పాపన్నపేట : వాగులు, వంకలు.. కొండలు, కోనలు.. దాటి వచ్చిన భక్తజనంతో ఆదివారం ఏడుపాయల వనం జనారణ్యమైంది. పాపన్నపేట మండలం ఏడు పాయల్లో కొలువుదీరిన వనదుర్గమ్మను దర్శించుకొని భక్తజనం తరించారు. చెక్ డ్యాం, అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీర నది పాయలో పుణ్య స్నానాలు ఆచరించి, వనదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అమ్మ దర్శనానికి సమయం పట్టింది. పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు, ఒడిబియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ధ్వనుల మధ్య ఏడుపాయల వన దుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. చల్లంగా చూడమ్మా.. వనదుర్గమ్మ తల్లి అంటూ భక్తులు వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆలయ పరిసరాల్లోని షెడ్లు, పచ్చని చెట్ల కింద భోజనాలు చేసి ఇళ్లకు తిరుగు పయనమయ్యారు.


Similar News