కాంగ్రెస్‌కి అధికారం ఇస్తే మన ఏళ్లతో మన కన్ను పొడుచుకున్నట్టే : మంత్రి

కాంగ్రెస్ కి అధికారం ఇస్తే మన ఏళ్లతో మన కన్ను పొడుచుకున్నట్టే అవుతుందని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు.

Update: 2023-11-10 09:08 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: కాంగ్రెస్ కి అధికారం ఇస్తే మన ఏళ్లతో మన కన్ను పొడుచుకున్నట్టే అవుతుందని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ ముషీనం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, ఎన్ఎస్‌యూఐ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు శ్రావన్ తదితరులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు అధికారంపై యావ తప్ప ప్రజల మీద ప్రేమ లేదన్నారు. అబద్దాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది సీట్లు బీఆర్ఎస్ గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. నాడు కరువు పీడిత ప్రాంతంగా ఉన్న తెలంగాణలో రెండు పంటలకు సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.

వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంటు అందించడంతో పాటుగా, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా కానుందన్నారు. రూ.4 వందల కే గ్యాస్ సిలిండర్, రైతు బంధు, ఆసరా పెన్షన్ లు పెంచుకోబోతున్నట్లు తెలిపారు. అందరం కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని హరీష్ రావు పిలుపునిచ్చారు. అనంతరం సీతారాంపల్లి, పుల్లూరు గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మంత్రి హరీష్ రావుకు మద్దతు పలికి తీర్మాణ ప్రతిని అందజేశారు.

Tags:    

Similar News