పిక్క దొరికిందో పీకి పడేస్తాయి
మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి.
దిశ, కంగ్టి : మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి. దారిని పోయే బాటసారులు, మోటార్ సైకిల్‌పై వెళ్లేవారిపై ఒక్కసారిగా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. స్థానిక సంత మార్కెట్లో, ప్రధానమైన కూడళ్లు, వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే వారిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడుతున్నాయి. విద్యార్థులను ఒంటరిగా స్కూలుకు పంపాలంటే తల్లిదండ్రులు బయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలే కాదు పెద్దలు కూడా బయటికి రావాలంటే బెదిరిపోతున్నారు. శునకాల సంఖ్య పెరిగిపోతున్నా వాటిని తరలించడం.. సంతానోత్పత్తిని నియంత్రించడానికి చర్యలు చేపట్టడం లేదు.
దీంతో వాటి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. వీధి కుక్కల నియంత్రణ బాధ్యతలను స్థానిక సంస్థలైన పంచాయతీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. గ్రామ సింహాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లైతే వాటిని జనావాసాలకు దూరంగా తరలించాల్సి ఉంటుంది. ఎవరినైనా కాటు వేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా వాటికి ఏడాదికోసారి రేబిస్ టీకాలను వేయించాలి. వీధికుక్కల సంతానోత్పత్తిని నియంత్రించేందుకు శస్త్ర చికిత్సలు చేయించాల్సి ఉంటుంది. కానీ ఈ దిశగా ఎక్కడా చర్యలు తీసుకున్నట్టు కానరాడం లేదు. కుక్కల వ్వవహారాన్ని ఇప్పటికే పలు దఫాలుగా పంచాయతీ అధికారులు, గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్రికలలో వరుస కథనాలు వస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.