గృహిణుల ఆరోగ్యానికి రక్షగా 'ఆరోగ్య మహిళ': జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

గృహిణుల ఆరోగ్యానికి రక్షగా ప్రభుత్వం 'ఆరోగ్య మహిళ' పథకాన్ని ప్రవేశపెట్టిందని, మహిళలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శరత్ అన్నారు.

Update: 2023-04-01 11:10 GMT

దిశ, సంగారెడ్డి: గృహిణుల ఆరోగ్యానికి రక్షగా ప్రభుత్వం 'ఆరోగ్య మహిళ' పథకాన్ని ప్రవేశపెట్టిందని, మహిళలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, మెప్మా, మహిళ శిశు సంక్షేమ శాఖల అధికారులతో ఆరోగ్య మహిళా కార్యక్రమం పై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాలో నాలుగు ఆరోగ్య మహిళ కేంద్రాలను ఝరాసంగం, జిన్నారం, ఆర్సిపూర్, బిలాల్పూర్ లలో ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ఎనమిది విభాగాల్లో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య మహిళపై ఎజెండా పెట్టుకోవాలని, స్వయం సహాయక సంఘాల మహిళలను ఆరోగ్య మహిళా కేంద్రాలకు తీసుకువెళ్లేలా షెడ్యూల్ చేయాలని, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులకు సూచించారు.

బ్రెస్ట్ క్యాన్సర్, ఛాతిలో గడ్డలు వంటి సమస్యలు గుర్తించేందుకు మామోగ్రామ్ టెస్టులు కూడా సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రి దేవి, డీఆర్డీవో శ్రీనివాస రావు, మెప్మా పీడీ గీత, శిశు సంక్షేమ అధికారి పద్మావతి, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ వోలు, ప్రోగ్రాం అధికారులు, నాలుగు ఆరోగ్య మహిళా కేంద్రాలకు సంబంధించిన ఐసీడీఎస్ సూపర్ వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్స్ లు, ఫార్మసిస్టులు, ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News