ప్రజా ఆశీర్వాద సభ స్థలంను పరిశీలించిన హరీష్ రావు
దుబ్బాకలో ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు దుంపలపల్లి రోడ్డులో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ స్థలాన్ని మంత్రి హరీష్ రావు సోమవారం పరిశీలించారు.
దిశ, దుబ్బాక: దుబ్బాకలో ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు దుంపలపల్లి రోడ్డులో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ స్థలాన్ని మంత్రి హరీష్ రావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఉప ఎన్నికల్లో సీఎం దుబ్బాకకు వచ్చి ఉంటే అప్పుడే గెలిచే వాళ్లమని, దుబ్బాక అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ, కేసీఆర్ అంటే కూడా ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. సీఎం పర్యటనతో దుబ్బాకలో అద్భుతమైన మెజార్టీతో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక చరిత్రలో కనివిని ఎరుగని తరహాలో పెద్ద ఎత్తున సభను జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కత్తి పోట్లకు గురైన బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సభలో పాల్గొంటారని చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సభకు ప్రజలను అధిక సంఖ్యలో తరలించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని బీఆర్ఎస్ లీడర్లకు దిశా నిర్దేశం చేశారు. సభ అనంతరం సీఎం రోడ్డు మార్గాన హైదరాబాద్ వెళ్లారన్నారు. సీఎం కేసీఆర్, కొత్త ప్రభాకరెడ్డిని దీవించాలని మంత్రి కోరారు. మంత్రి వెంట కౌన్సిలర్ ఆస యాదగిరి, బీఆర్ఎస్ లీడర్లు రొట్టె రాజమౌళి, గుండవెళ్లి ఎల్లారెడ్డి, పల్లె రామస్వామి గౌడ్, అబ్బుల రాజలింగం గౌడ్, ఆసస్వామి, మూర్తి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి సంజీవరెడ్డి, రాధ మనోహార్ రెడ్డి, తునికి సురేష్ తదితరులు పాల్గొన్నారు.