వడగండ్ల వాన బీభత్సం
సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలుల వీచడంతో చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. చేతికొచ్చిన వరి పంటలు నేలవాలాయి, మామిడి కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. జిల్లా కేంద్రంలోని ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వానకు లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమయం అయ్యాయి. హైదరాబాద్ రోడ్డులోని రత్నదీప్ సూపర్ మార్కెట్ సమీపంలో, విక్టరీ టాకీస్ నుంచి ఎన్సాన్ పల్లి వెళ్లే మార్గంలో రెండు పెద్ద చెట్లు విరిగిపోయి రోడ్ల మీద పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మోడల్ బస్టాండ్ ప్రాంతం జలమయం అయింది. చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నంగునూరు మండల పరిధిలోని వెంకటాపూర్, ముండ్రాయి, నంగునూరు, నర్మెటతో పాటు అన్ని గ్రామాల్లో ఓ మోస్తారు వర్షం పడింది. సిద్దిపేట రూరల్, అర్బన్, నారాయణ రావు పేట మండలంలో ఓ మోస్తారు వర్షం పడింది. చిన్నకోడూరు మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సానికి పొట్టకొచ్చిన వరి చేన్లు దెబ్బతిన్నాయి.