ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రభుత్వ కొలువులు....
ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వారి కళ సహకారం చేసుకున్న ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో జరిగింది.
దిశ,అల్లాదుర్గం : ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వారి కళ సహకారం చేసుకున్న ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో జరిగింది. అల్లాదుర్గం గ్రామానికి చెందిన ఓ దర్జీ కుటుంబంలో దసరా పండుగ వెలుగులు నింపింది. వివరాల్లోకి వెళితే అల్లాదుర్గంలో నివసిస్తున్న దర్జీ సదానందానికి ముగ్గురు కూతుర్లు. ముగ్గురు కూతుర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో ఆ ఇల్లు కొలువుల నిలయంగా మారింది. కూతుర్లు పుట్టారని బాధపడకుండా తను నమ్ముకున్న దర్జీ వృత్తిని ఆసరాగా చేసుకుని తన ముగ్గురు కుమార్తెలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి విద్యాబుద్ధులు నేర్పి పట్టుదలతో వారిని తను సాధించలేకపోయినా టీచర్ ఉద్యోగం పిల్లలు సాధించాలనే దృఢ సంకల్పంతో తన ముగ్గురు కూతుర్లని కూడా ఆర్థిక స్థోమత లేకున్నా నానా తంటాలు పడి చదివించాడు.
తన కూతుర్లు కూడా తండ్రి చాటు పిల్లల్లాగా నాన్న సంకల్పాన్ని నెరవేర్చాలనే పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించారు. అయితే పెద్ద కూతురు శిరీష, రెండో కూతురు మానస, మూడవ కూతురు ఉషశ్రీ , రెండో కూతురు మానస కు 2012 డీఎస్సీలో ఉద్యోగం రాగ చిన్న కూతురు ఉషశ్రీ కి 2018 డీఎస్సీ లో ఉద్యోగం సంపాదించింది. కాగా పెద్ద కూతురు ఇంతవరకు ఉద్యోగం సాధించలేకపోయిందనే భాద ఆ తండ్రిని వేధించసాగింది. 2024 డీఎస్సీ లో ఆమె కూడా ఉద్యోగం సాధించింది. ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ తండ్రి చిరకాల కోరిక ఆ ముగ్గురు నెరవేర్చారు. క్రమశిక్షణ పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏది లేదనే మాటలు ఆ ముగ్గురు కూతుర్లు నెరవేర్చారు. చాలామంది కూతురు పుడితేనే భారంగా భావించే ఈ రోజుల్లో ప్రతి తండ్రి ఈ తండ్రిలా ఆలోచించి కూతుర్ల భవిష్యత్తు ఈ విధంగా తీర్చిదిద్దాలని ఆ ముగ్గురు కూతుర్లు కోరుతున్నారు. మా తండ్రి మాకు ఆదర్శం అని కూతుర్లు ఆ తండ్రిని కొనియాడుతున్నారు. గ్రామస్తులు, బంధువులు, ఆ తండ్రిని అందరూ ప్రశంసించడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.