మహనీయుడు భగీరథ మహర్షి.. మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా

కఠోర దీక్షతో దివి నుండి భువికి గంగను రప్పించి సంకల్పం ఉంటె ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు.

Update: 2023-04-27 12:53 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : కఠోర దీక్షతో దివి నుండి భువికి గంగను రప్పించి సంకల్పం ఉంటె ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో బీసీ అభివృధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ నాయకులతో కలిసి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన గావించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆనాడు భగీరధుడు చేసిన ప్రయత్నాలవల్లే మనమీనాడు పవిత్ర గంగాజలంతో పునీతులమవుతున్నామని అన్నారు.

గంగను భువికి తీసుకురాకుంటే మన పరిస్థితి ఏ విధంగా ఉండేదోనని, గంగను తీసుకురావడం ద్వారా చక్కటి పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. మూడవ ప్రపంచ యుద్ధమే వస్తే అది నీటి సమస్య గురించే ఉంటుందని అన్నారు. మన రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగాయని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని అందిస్తున్నామని అన్నారు. నీటిని పొదుపుగా వినియోగించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులుండే అవకాశాలున్నాయని, ప్రతి ఒక్కరికి నీటిని సమానంగా అందించాలంటే పొదుపుగా వాడడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ విషయం పై ప్రజలలో చర్చ జరగాలని, వివిధ సంఘాలలో, పిల్లలలో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ అన్నారు.

విజ్ఞానం సముపార్జించినవాడు ఏదైనా సాధించవచ్చని, ఇందుకు చదువు ఒక్కటే మార్గమని కలెక్టర్ అన్నారు. మనం కూడా ఏదైనా సాధించాలనే సంకల్పంతో గట్టిగా ప్రయత్నించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుటకు గురుకులాలు, పాఠశాలలు, వసతి గృహా సౌకర్యం కల్పిస్తూ ఉచిత విద్య అందిస్తున్నదని తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు చదువు పై ప్రత్యేక శ్రద్ధ కనబరచి బాగా చదివి దేశం గర్వపడే విధంగా డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా భగీరథుని అకుంఠిత దీక్ష, పట్టుదలను మార్గదర్శకంగా తీసుకొని అభివృద్ధి పధంలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దత్తు సాగర్, జిల్లా అధ్యక్షలు సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ సాగర్, బీసీ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారాం, రవీందర్ సాగర్, సాయిలు, మున్సిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ, సహాయ బీసీ అభివృద్ధి అధికారి నాగరాజు గౌడ్, కార్యాలయ సిబ్బంది, నగర ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News