పెద్ద సార్ల కార్లు.. రయ్.. రయ్..

మేం రూల్స్ చెబుతాం.. రూల్స్ పాటించం’ అంటున్నారు సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు.

Update: 2024-10-24 04:03 GMT

దిశ, సంగారెడ్డి : ‘మేం రూల్స్ చెబుతాం.. రూల్స్ పాటించం’ అంటున్నారు సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు. సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ వరకు నిబంధనలు పాటించకుండా ఓవర్ స్పీడ్ తో వాహనాల పై దూసుకుపోతున్నారు. అతివేగం అత్యంత ప్రమాదకరం. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అనే విషయాన్ని మరిచిన జిల్లా అధికారులు తమకు రూల్స్ గీల్స్ జాన్తానై అంటూ తమ వాహనాల్లో అతి వేగంతో ప్రయాణం చేస్తున్నారు. సంగారెడ్డిలోని జిల్లా ఉన్నతాధికారులు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ల వరకు ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. వీరు పాటించకపోయినా రోడ్డు నిబంధనలు మాత్రం వాటి విధులను వారు సక్రమంగా నిర్వహించారు. రోడ్డు పై వేగంగా వెల్తున్న జిల్లా అధికారుల వాహనాలకు ఓవర్ స్పీడ్ చలాన్లు విధిస్తున్నారు. 2022 నుంచి అధికారుల వాహనాల పై ర్యాష్ డ్రైవింగ్ పెండింగ్ చలాన్లు భారీగానే ఉన్నాయి. అయినా కూడా వారు తమ వాహనాల వేగాన్ని మరింత పెంచుతూ వేగంగా దూసుకుపోతున్నారు. ఎక్కవగా అధికారుల వాహనాలకు రాష్ డ్రైవింగ్‌తో సంగారెడ్డి, మెదక్, సైబరాబాద్ పరిధిలో భారీగా చలాన్లు ఉన్నాయి.

జిల్లా అధికారుల వాహనాల పై రాష్ డ్రైవింగ్ చలాన్లు..

సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ వరకు రాష్ డ్రైవింగ్ చలాన్లు ఉన్నాయి. 2022 నుంచి అధికారుల వాహనాల పై పెండింగ్ చలాన్లు ఉన్నా, వాటిని కట్టేందుకు ప్రభుత్వం డిస్కౌంట్ ఇచ్చినా జిల్లా అధికారులు మాత్రం చలాన్లు కట్టలేదు. సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ వాహనం పై నిజామాబాద్ జిల్లా పరిధిలోని డిచ్ పల్లి నేషనల్ హైవే పై ప్రమాదకరంగా ఓవర్ స్పీడ్ తో వాహనం నడిపినట్లు టీఎస్ 08 ఎఫ్.హెచ్ 3535 నంబర్ కు ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి. జిల్లా పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్​ మెంట్ అధికారి కారు నంబర్ టీఎస్ 09 ఎఫ్ఆర్ 8025 పై ఆరు పెండింగ్ చలాన్లు ఉండగా అవి మొత్తం రాష్ డ్రైవింగ్ కు సంబంధించినవి కావడం గమనార్హం. అదే విధంగా జిల్లా ఫారెస్టు అధికారి వాహనం టీఎస్ 09 ఈహెచ్ 6165 నంబర్ పై కూడా ఆరు చలాన్లు ఉండగా మొత్తం రాష్ డ్రైవింగ్ కు సంబంధించినవే. రెవెన్యూ డివిజినల్ అధికారి టీఎస్ 15 ఎఫ్ఎల్ 2523 నంబర్ గల కారును ఓవర్ స్పీడ్ తో నడిపారని సైబరాబాద్, సంగారెడ్డి పరిధిలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. అదే విధంగా జిల్లా అదనపు కలెక్టర్ వాహనం టీఎస్ 15 ఈటీ 0333 నంబర్ పై ఓవర్ స్పీడ్, ప్రమాదకర డ్రైవింగ్ చేసినట్లు సైబరాబాద్ పరిధిలోని దుందిగల్ ఓఆర్ఆర్ జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్ పరిధిలో వేశారు.

ఎవరైనా ఇష్టారాజ్యంగా వాహనాలు నడపొద్దు..

సామాన్య ప్రజలైనా జిల్లా ఉన్నతాధికారులైనా తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. జిల్లా అధికారి అంటేనే అందరికి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వారు ఏది చెప్పినా ప్రజలు వింటారు. ఈ ఉన్నతాధికారులే రోడ్డు భద్రతావారోత్సవాల్లో ట్రాపిక్ నిబంధనలు, రోడ్డు భద్రత నిబంధనల పై లెక్చర్ ఇస్తారు. ప్రజలకు నీతి సూత్రాలు చెప్పిన జిల్లా అధికారులే రోడ్డు పై ఓవర్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే సహించేది లేదని రవాణాశాఖ హెచ్చరిస్తోంది. ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడిపే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారుల పై రవాణశాఖ ప్రత్యేక దృష్టిపెట్టామని, నిబంధనల ప్రకారమే వాహనాలు నడపాలని రవాణశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ డ్రైవింగ్ (స్పీడ్ డ్రైవింగ్) తో ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. రోడ్డు పై ప్రయాణించేప్పుడు కచ్చితంగా నిబంధనలు పాటించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. అయినా మాకెందుకు మేము జిల్లా అధికారులమే కదా మాకు ఎవ్వరూ ఏమి చేయలేరంటూ ఇతరులకు ప్రమాదం జరిగే విధంగా వాహనాలు నడపడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Similar News