ఫ్యాక్టరీ యజమాన్యాలు రైతులకు సహకరించాలి : సంగారెడ్డి కలెక్టర్

చెరుకు సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిన కారణంగా చెరుకు పంట

Update: 2024-10-23 13:27 GMT

దిశ, సంగారెడ్డి : చెరుకు సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిన కారణంగా చెరుకు పంట సాగు చేసే రైతులకు మద్దతు ధర అందించే విధంగా చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు రైతులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో చెరుకు రైతులు, చక్కెర కార్మాగారాల యజమాన్యాలతో వివిధ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేన్ అధికారులు కలెక్టర్ కు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెరుకు మద్దతు ధరను మెట్రిక్ టన్నుకు రూ. 3682 గా నిర్ణయించిందని తెలిపారు. అదే విధంగా రైతులు, రైతు సంఘాల నాయకులు 2024-25 సంవత్సరం కోసం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు మెట్రిక్ టన్నుకు రూ. 4500 చెల్లించాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు షుగర్ ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్‌లతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా, పంటకు తగిన ధర అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేటి పరిస్థితుల్లో సాగు ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయని, యాజమాన్యాలు తగిన మద్దతు ధరను ప్రకటించాలని సూచించారు. చెరుకు టన్ను కు కనీసం రూ. 4500 మద్దతు ధర నిర్ణయించాలని సూచించారు. ఈ సమీక్షలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, షుగర్ కేన్ కమిషనర్ రాజశేఖర్, రైతు సంఘం నాయకులు, గణపతి షుగర్, గాయత్రి షుగర్స్ మాగి , గంగా కావేరి ఆగ్రో ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Similar News