దేవుని భూములకే శఠగోపం..

శ్రీ ఎంబెరుమానార్ స్వామి ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయి.

Update: 2023-03-19 02:29 GMT

కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ ఎంబెరుమానార్ స్వామి ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అత్యంత పురాతన దేవాలయంగా గుర్తింపు ఉన్న ఆలయానికి సుమారు 32 ఎకరాల భూమి ఉంది. 2011 వరకు సిద్దులగుట్ట సిద్దేశ్వర స్వామి ఆలయం కొడవటూరు ఎండోమెంట్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఏర్పాటు చేయగా స్వామి వారి ఆలనాపాలన చూసుకునేది. అలాగే ఆస్తుల వేలం పాట ద్వారా వచ్చే ఆదాయం స్వామి వారి బ్యాంక్​అకౌంట్‌లో జమ అయ్యేది. ఆ తర్వాత ఎండోమెంట్​ అధికారులు ఆలయ పర్యవేక్షణల నిర్లక్ష్యం వహించడంతో 2014 తర్వాత ఆలయ పర్యవేక్షణ బాధ్యత గ్రామ పంచాయతీ పరిధిలోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఆలయ అభివృద్ధి కుంటుపడింది. ఆలయ ఆస్తుల వేలం పాటను వేయడం కూడా ఆపేశారు. మెల్లగా కొందరు రైతులు ఒక్కొక్కటిగా ఆక్రమించి పట్టాలు చేయించుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలయ భూములను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

దిశ, కొమురవెల్లి : శ్రీ ఎంబెరుమానార్ స్వామి ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్​ 214, 292, 297,298, 297, 307, 312 మొత్తం విస్తీర్ణం 32.3400ఎకరాలు ఉండగా 2011 సంవత్సరం వరకు ఈ ఆలయం సిద్దులగుట్ట సిద్దేశ్వర స్వామి ఆలయం, కొడవటూరు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఏర్పాటు చేశారు. భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఆస్తుల వేలం పాట, ధూప దీప నైవేధ్యాలు సాగేవి. ఆస్తుల వేలంపాట ద్వారా వచ్చే ఆదాయం ఆలయ బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యేది. ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఆలయ పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించారు. 2014 రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆలయ పర్యవేక్షణ మొత్తం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగింది.

ఆలయ ఆస్తుల వేలం పాట వేయకుండా ఒకవైపు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోడ్డు నిర్మాణం, పాంపౌండ్స్ వంటి అభివృద్ధి పనులు చేపడుతూ ఇంకోవైపు ఆలయ ఆస్తులు, సహజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పక్కదారి పట్టిస్తూ ఆదాయానికి గండికొట్టారు. 2020 సంవత్సరంలో మాజీ సైనికుడు ఈ విషయాన్ని ఎండోమెంట్ కమిషనర్, సంగారెడ్డి కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆలయానికి విశ్వనాథ శర్మను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించారు.

ఆస్తులు 32.3400 ఎకరాల్లో కేవలం 312 సర్వే నెంబర్‌లో ఆలయ భూమి 3 ఎకరాలు విస్తీర్ణం మాత్రమే పక్కగ్రామమైన రాంసాగర్ గ్రామ ప్రజలతో వివాదం నడుస్తోంది. ఆలయానికి ఒక కమిటీ నియమించి మిగతా ఆస్తులను వేలం పాట వేసి ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉన్నా కేవలం మూడు ఎకరాల విస్తీర్ణం వివాదంలో ఉందని సాకు చెప్తూ ఆస్తుల హద్దులు తెలియవని నాలుగేళ్లుగా సింగిల్ ఎండోమెంట్ కమిటీ నియమించకుండా ఆస్తులు వేలం పాట వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఒకవైపు ఆస్తులు హద్దులు తెలియవు అని కమిటీని నియమించకుండా ఆస్తులు వేలం పాట వేయకుండా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రస్తుతం సిద్దిపేట వెంకటేశ్వర ఆలయ ఈఓ విశ్వనాధ్ శర్మ నిర్లక్ష్యం వహిస్తున్నడని ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకోవైపు గ్రామ సర్పంచ్ ఆలయ ఆస్తుల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద రోడ్డు నిర్మాణం హరితహారం చెట్ల పెంపకం జామ తోట, దానిమ్మ తోట లాంటివి అభివృద్ధి పనులు చేపట్టడం గమనార్హం.

ఈ విషయంపై సర్పంచ్​ బీమనపల్లి కరుణాకర్​ స్పందిస్తూ సమాంతరంగా లేని భూమిలో చెట్లు నాటినట్లు తెలిపారు. కొమురవెల్లి మల్లికార్జున దేవస్థానానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఆలయం అభివృద్ధి చేస్తే పర్యాటకంగా గుర్తింపు లభిస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. పాలకులు అధికారులు ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధిపై ఆసక్తి కనబరచడం లేదు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు.

కొంతమంది రైతులు కబ్జా చేశారు..

ఎంబెరుమానార్ స్వామి ఆలయం పురాతన ఆలయంగా గుర్తింపు పొందింది. ధూప దీప నైవేద్యం పథకం కింద నెలకు ఆరు వేలు అందుతున్నాయి. ఆలయ భూమిని కొంతమంది రైతులు కబ్జా చేయడంతో ఆలయానికి పొలం గట్ల పై రావాల్సి వస్తుంది. :– ఆలయ పూజారి బాలకిషన్ రాజు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయని గతంలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మూడు ఎకరాలు పక్క గ్రామమైన రాంసాగర్ తో వివాదంలో ఉండగా, తొమ్మిది ఎకరాలు రైతులు కబ్జా చేసిన భూమి కోర్టు పరిధిలో ఉంది. ఏ క్షణమైనా కబ్జాదారుల పాస్ బుక్కులు రద్దు కావొచ్చు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో జాప్యం జరుగుతోంది. అలాగే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇట్టి భూమిని వేలం వేయడం లేదు. :– ఇన్​ చార్జ్​ ఈఓ విశ్వనాథ శర్మ

Tags:    

Similar News