పక్కరాష్ట్రాల్లో ఏడుగంటలు, తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు.. మంత్రి హరీష్ రావు
పక్కరాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్ణాటకలో 7 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, తెలంగాణలో 24 గంటలు ఉచిత కరెంటు రైతులకు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.
దిశ, చిన్నకోడూర్ : పక్కరాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్ణాటకలో 7 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, తెలంగాణలో 24 గంటలు ఉచిత కరెంటు రైతులకు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. నారాయణరావుపేట మండలంలోని మాటేండ్ల జక్కాపూర్ బంజరపల్లి గ్రామాల్లో పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాటేండ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న మహారాష్ట్రలోని ఔరంగబాద్, నాందేడ్ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరు రోజులకు ఒకసారి నల్లాలు వస్తాయని తెలిపారు. మన కేసీఆర్ పుణ్యమా అని నిత్యం ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు. దేశంలోని 16 రాష్ట్రాలలో బీడీలు చేసే వారికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా ఇవ్వడం లేదని, తెలంగాణలో మాత్రం బీడీలు చేసే కార్మికులకు పింఛన్లు ఇస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు కాదు. ఆయిల్ ఇంజన్ సర్కారని, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో కరెంటు దిక్కులేక వ్యవసాయ పంటలు పండించడం కోసం 20 లక్షల ఆయిల్ ఇంజన్లు నడుస్తున్నాయని మంత్రి హరీశ్ విమర్శించారు.
మండుటెండలలో జూన్ నెల 1న సైతం నక్కవాగు చెరువు నిండి ఉందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. గ్రామ నర్సింలు కుంటకు నీళ్లు రావాలంటే.. కాల్వలు తవ్వాలి. ఇందు కోసం గ్రామప్రజలు సహకారాన్ని అందించాలని కోరారు. మాటిండ్లకు రావాలంటే వానలు పడ్డప్పుడు నక్కవాగు దారి ఉండేది కాదనీ, నక్కవాగు పక్కన చెరువులో, మాటిండ్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 35 బోర్లు వేసినా చుక్క నీళ్లు రాలేదు. సీఎం కేసీఆర్ పుణ్యమా అని ఇంటింటికీ మిషన్ భగీరథ, కాళేశ్వరంతో తాగు, సాగునీరు గోస తీరిందని మంత్రి హరీశ్ వెల్లడించారు. మాటిండ్ల గ్రామ విద్యుత్తు సబ్ స్టేషను ప్రజల కోరిక నెరవేరిందన్నారు. దర్గాకు మెట్లు, శేఖర్ రావుపేటకు ఫంక్షన్ హాల్, రూ.3.80 కోట్ల రూపాయలతో జిల్లెల వరకూ రోడ్డు సౌకర్యం, బీసీ కమ్యూనిటీ హాల్, మహిళా మండలి భవనం ప్రారంభాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ బాలకిషన్, సర్పంచులు పరశురాములు, కొంగరి సత్యనారాయణ, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.