స్పెషల్ ఆఫీసర్ అంటూ ఫోన్ కాల్స్ వస్తే భయపడవద్దు

మీ కుమారుడు, కూతురు మా కస్టడీలో ఉన్నారు, అరెస్ట్ అయ్యారు అంటూ స్పెషలాఫీసర్ల పేరుతో వస్తున్న కాల్స్ కు బయటపడద్దని సంగారెడ్డి జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ వేణు గోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-20 16:23 GMT

దిశ, సంగారెడ్డి : మీ కుమారుడు, కూతురు మా కస్టడీలో ఉన్నారు, అరెస్ట్ అయ్యారు అంటూ స్పెషలాఫీసర్ల పేరుతో వస్తున్న కాల్స్ కు బయటపడద్దని సంగారెడ్డి జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ వేణు గోపాల్ రెడ్డి అన్నారు. అరెస్టు చేశాం, వారిని విడుదల చేయాలంటే డబ్బులు ఇవ్వాలని వచ్చే ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకుంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీబీఐ, ముంబై పోలీస్, కస్టమ్స్, ఈడీ అని వచ్చే ఫోన్ కాల్స్ కి అస్సలు భయపడవద్దన్నారు. పోలీస్ కానీ మరే ఇతర దర్యాప్తు సంస్థలు డబ్బు అడగరని, అంతేకాకుండా ఎలాంటి హడావుడి కూడా చెయ్యరని, కేవలం అప్రమత్తం గా ఉంటే సరిపోతుందన్నారు. కేసు లేకుండా వదిలేయాలంటే డబ్బు పంపండి అనే కాల్స్ వస్తే భయపడవద్దని సూచించారు. అదే విధంగా ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాల్లో మనం డబ్బులు చెల్లించడమే తప్ప విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండదని, ఒకవేళ ఉన్నా కేవలం రూ.5 వేలలోపు ఉంటుందని, ఆపైన మీరు ఎంత పెట్టినా మోసపోతున్నట్టే లెక్క అన్నారు.

కాబట్టి అధిక లాభాల కోసం ఎవరూ ఆశ పడకూడకుండా, ఆన్‌లైన్‌ వ్యాపారాలు, ఇన్వెస్ట్‌మెంట్ల జోలికి వెళ్లకూడదన్నారు. సైబర్‌ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మోస పోయామని తెలిసిన వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలన్నారు. సైబర్ నేరాల్లో దొంగిలించిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు సైబర్‌క్రైమ్‌పై గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు సొమ్ము పోగొట్టుకున్న తర్వాత నిమిషాల వ్యవధిలో 1930 కి కాల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న డబ్బులు ఆపేందుకు వీలు ఉంటుందన్నారు.

సైబర్ క్రైమ్ లో డబ్బులు పొగొట్టుకుంటే గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేయాలి..

డబ్బు పోగొట్టుకున్న తర్వాత మొదటి గంటను "గోల్డెన్ అవర్"గా పేర్కొంటారని సైబర్ క్రైమ్ బ్యూరో డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బాధితులు 1930కి కాల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయడం ద్వారా మొత్తం పోగొట్టుకున్న తర్వాత నిమిషాల్లో ఫిర్యాదును నమోదు చేస్తే ,తక్షణ రిపోర్టింగ్ ద్వారా నిందితుల బ్యాంక్ ఖాతాలు లేదా డిజిటల్ వాలెట్లలో మోసం మొత్తాన్ని స్తంభింపజేసే అవకాశాలను గణనీయంగా ఉంటాయన్నారు. తక్షణమే ఫిర్యాదు చేయడం ద్వారా బాధితులకు రీఫండ్‌ను సులభతరం అవుతుందన్నారు.

సైబర్‌ క్రైమ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ క్రైమ్‌ బాధితులు సైబర్‌ మోసాలకు పాల్పడి డబ్బులు పోగొట్టుకుంటే వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ మోసానికి గురయినవారు త్వరగా ఫిర్యాదు చేయకుంటే కేసును నివేదించడంలో ఆలస్యం అవుంతుందని, పోలీస్ లేదా బ్యాంకు నోడల్ ప్రభావాన్ని తగ్గిస్తుందని, ఇది దొంగిలించబడిన డబ్బును తిరిగి పొందడం కష్టతరం చేస్తుందన్నారు. అందుకే సైబర్ మోసగాళ్లు ఎవరినైనా టార్గెట్ చేస్తే 1930 కి కాల్ చెయ్యండి లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని తెలిపారు.


Similar News