కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 3 గంటల సమయం
అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు.
దిశ, ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం అమావాస్య, పుష్యమి నక్షత్రం సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచి చేరుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అమావాస్య సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, మేల్కొల్పు సేవ, మహా రుద్రాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించిన అనంతరం రాత్రి 4 :30 నుండి భక్తులకు ప్రవేశాన్ని దర్శనానికి అనుమతించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఓం నమశ్శివాయ పంచాక్షరి నామం తో మార్మోగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు పూలమాల శాలలతో సన్మానించారు. ఝరాసంగం ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు