అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు..అనాదిగా వస్తున్న ఆచారం
ఏడాదికొకసారి వచ్చే దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే
దిశ, నర్సాపూర్: ఏడాదికొకసారి వచ్చే దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే దీపాలను వెలిగించి కుటుంబ సభ్యులతో పటాకులు కాలుస్తూ సంతోషంగా సరదాగా గడుపుతుంటారు. ఒక కుటుంబం మాత్రం దీపావళి పర్వదిన వేడుకలను తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానంలో జరుపుతూ సంతోషంగా గడుపుతున్నారు. దీపావళి పండుగ రోజు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి సమాధుల వద్ద పటాకులు కాలుస్తూ సరదాగా గడుపుతున్నారు. వివరాల్లోకి వెళితే నర్సాపూర్ మండల పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన బ్యాగారి యాదగిరి, మహేష్, బాలరాజు, శ్రీరాములు, మహేందర్, లక్ష్మీ అమృత మానేమ్మ తదితరులు ఒకే కుటుంబాలకు చెందిన వారు.
వీరి తాత ముత్తాతల నుంచి ప్రతి దీపావళి పర్వదినం నాడు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వారి పూర్వీకుల సమాధుల వద్ద దీపాలు వెలిగించి పటాకులు కాలుస్తూ సంతోషంగా గడపడం ఆచారంగా వస్తుంది. అంతేకాకుండా ఇటీవల చనిపోయిన వారి కుటుంబానికి చెందిన లక్ష్మీ నారాయణ, సత్యనారాయణ లకు చెందిన సమాధులను దీపావళికి రెండు రోజుల ముందు నిర్మించారని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా తమ పూర్వీకుల సమాధుల వద్ద పండుగ చేసుకునే ఈ ఆచారం తమ తాత ముత్తాతల నుంచి వస్తుందని ప్రతి సంవత్సరం దీపావళి పండుగ నాడు స్మశానానికి వెళ్లి అక్కడే పండుగను జరుపుకోవడం కొనసాగిస్తున్నామని తెలిపారు. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను సమాధుల వద్ద కూర్చుని కుటుంబ సభ్యులంతా కలిసి తింటామని చెప్పారు.