ఎఫ్టీఎల్ పరిధిలోని బహుళ అంతస్తుల భవనం కూల్చివేత..
చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైంది.
దిశ బ్యూరో, సంగారెడ్డి: చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైంది. అధికార యంత్రాంగం ఆ నిర్మాణాన్ని డిటొనేటర్లతో జలసమాధి చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్‌షాయిపేట మల్కాపూర్ పెట్ట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ‘దిశ’ వరుస కథనాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ కథనాలతో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి స్పందించారు. విచారణకు ఆదేశించడంతో కొండాపూర్ మండల రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించి నిర్మాణం ఎఫ్‌టీఎల్‌లోనే ఉందని గుర్తించి కలెక్టర్‌కు తెలిపారు. ఆమె ఆదేశాల మేరకు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య బహుళ అంతస్తుల భవనాన్ని తహసీల్దార్ అనిత, ఇతర అధికారులు నేలమట్టం చేయించారు. కాగా, భారీ నిర్మాణం కావడంతో కూలుతున్న సమయంలో వచ్చిన రాయి తగిలి అక్కడే ఉన్న హోంగార్డు గోపాల్ తలకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న అధికారులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు వెల్లడించారు.