మోడీ పాలనలో రాజ్యాంగం నిర్వీర్యం : చాడ వెంకట్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన భూ దోపిడిపై కాంగ్రెస్
దిశ, సిద్దిపేట ప్రతినిధి : బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన భూ దోపిడిపై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీపీఐ (ఎడ్ల గురువారెడ్డి) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుట్టలను పట్టాలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దీ అని మండిపడ్డారు. సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్, కరీంనగర్ తదితర ప్రధాన నగరాల్లో బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలో 7 వేల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందని, ఆ భూములకు సంబంధించిన రైతు బంధు సైతం తీసుకున్నారని అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో ధరణి పేదల పాలిట షాపంగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న నేపథ్యంలో రైతు భరోసా పథకం లో ఎకరాకు రూ.12 ఆర్ధిక సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని చాడ వెంకట్ రెడ్డి స్వాగతించారు. అదే సమయంలో రైతులను సెల్ఫ్ డిక్లరేషన్ అడగడం పై ఆక్షేపణ వ్యక్తం చేశారు. 15 ఎకరాల వరకు రైతు భరోసా వర్తింప చేస్తే బాగుంటుందని చాడ అభిప్రాయపడ్డారు. భూములను సర్వే నెంబర్ల వారిగా సమగ్ర భూ సర్వే జరిపి పల్లె పల్లెకు రెవెన్యూ శాఖ ను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మల్లన్న సాగర్ తో పాటుగా వివిధ ప్రాజెక్టుల భూ నిర్వాసితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలం దృక్పథంతో పరిష్కరించాలన్నారు. సర్వ శిక్ష అభియాన్, సివిల్ సప్లై హమాలీ కార్మికులతో ప్రభుత్వం చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం..
ప్రధాని మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నాడని సీపీఐ జాతీయ కార్య వర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు అన్నారు. సంస్థానాల విలీనం, దున్నే వాడికి భూమి, వెట్టి చాకిరీ కి వ్యతిరేకంగా సీపీఐ పోరాటం చేసిందని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి కార్పొరేట్ శక్తులను కొమ్ము కాస్తుందని మండిపడ్డారు.
సిద్దిపేటలో పెద్ద ఎత్తున భూ దోపిడీ : సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్
సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను జీవో 59 అడ్డు పెట్టుకొని కబ్జా చేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. సర్వే 1340 లో 2700 గజాలను 9 మంది రెగ్యులరైజ్ చేసుకున్నారని అన్నారు. మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ తన బినామీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ నాయకులు అక్రమించుకున్నారని అన్నారు. అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములను పేదలకు పంచే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ నాయకులు లక్ష్మణ్, మల్లేషం, శంకర్, బన్సీలాల్, రాజేశం, ఆరిఫ్, మధు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.