వంద రోజుల్లోనే నియోజకవర్గం అభివృద్ధి

వంద రోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెదక్ అభివృద్ధి బూతద్దంలో పెట్టి చూడాల్సిన దుస్థితి దాపురించిందని మెదక్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మండిపడ్డారు.

Update: 2024-04-10 14:40 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : వంద రోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెదక్ అభివృద్ధి బూతద్దంలో పెట్టి చూడాల్సిన దుస్థితి దాపురించిందని మెదక్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మండిపడ్డారు. బుధవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజక వర్గంలో ఎక్కడ చూసినా అవినీతి లెక్కలు తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల పథకాల అమలుతో పాటు నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని అన్నారు.

    మెదక్ నియోజక వర్గానికి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా 15 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు, ఎస్డిఎఫ్ కింద రూ .10 కోట్ల అభివృద్ధి పనులతో పాటు మెదక్ పట్టణానికి టీఎస్ఎఫ్ఐడీసీ ద్వారా 37.5 కోట్లు, రామాయంపేట పట్టణ అభివృద్ధి పనులకు రూ. 25.06 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని ఆయన తెలిపారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి వంద రోజుల్లో రూ. 88.00 కోట్లతో శ్రీకారం చుట్టామని పేర్కోన్నారు. అలాగే పట్టణాలను సుందరీకరించుకునేందుకు అందమైన చౌరస్తాల నిర్మాణంతో పాటు మెదక్ పట్టణంలో పార్క్ నిర్మాణం, మెదక్ ఖిల్లా ను అభివృద్ధి పర్చడం జరుగుతుందని అన్నారు.

    ఎన్నికల కోడ్ ముగియగానే మరింతగా అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకొని మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో ఉంచుతానని ఆయన తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ర్టంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటు కూడా రాదని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ తెలిపారు. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ఇందిరా గాంధీ గెలిచిన తరువాత నేడు తమ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. మెదక్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిఫ్ట్​గా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నిజాం షుగర్స్ పునరుద్ధరణకు కృషి

నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మెదక్ నియోజక వర్గ ప్రాంతానికి, ఇక్కడి రైతులకు ఒక వరం అని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. ఇక్కడి రైతాంగం సుమారుగా 11 వేల ఎకరాల్లో చెరుకును పండించి ఇదే మంబోజిపల్లి ఫ్యాక్టరీలో సుమారుగా 11 వేల ఎకరాల చెరుకు క్రష్షింగ్ జరిగేదని ఆయన అన్నారు. త్వరలోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్దీకరణపై ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఇక్కడి రైతాంగానికి తీపికబురు అని ఆయన పేర్కొన్నారు. 

Tags:    

Similar News