రైతులకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

రైతు భరోసా పేరిట గొప్పలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి,

Update: 2025-01-06 10:48 GMT

దిశ,దుబ్బాక : రైతు భరోసా పేరిట గొప్పలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి ఎకరాకు రూ.12 వేలు మాత్రమే ఇస్తామని చెప్పడం ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనం అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసానికి నిరసనగా సోమవారం హబ్షీపూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో రైతుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేతిలో రైతులు మోసపోతూనే ఉన్నారని విమర్శించారు.

ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పట్టిందని ఇప్పుడు ఆ రైతుభరోసాను రూ.12 వేలకే పరిమితం చేయడమంటే రైతులను వంచించడమేనని మండిపడ్డారు. రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం యావత్‌ రైతాంగాన్ని మోసం చేసిందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో రైతులకు హామీలతో ఆశచూపి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు.అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడాదిపాటు కాలయాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు రైతుభరోసాకు అనేక కొర్రీలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ ఇచ్చే ముష్టి పదివేలు ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15 వేలు ఇస్తాం’ అంటూ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు రూ.15 వేల హామీని పక్కకునెట్టి, ఆ పదివేలకు మరో రూ,2 వేలు మాత్రమే కలిపి రూ,12వేలు ఇస్తామనడం కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అని మరోసారి రుజువైందన్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం లో రైతులకు ప్రతి సీజన్‌లో ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వం కన్నా రూ.1000 మాత్రమే ఎక్కువగా ఇస్తుండటం గమనార్హం అన్నారు. రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.రైతుభరోసాకు కోతపెట్టిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ప్రతి రైతుకూ గుండెకోతను మిగిల్చిందని విమర్శించారు.ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ లన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు పాల్గొన్నారు.


Similar News