వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలి

అకాల వర్షానికి నష్టపోయిన పంటకు ఎకరానికి రూ. 10 వేలు ఇచ్చి రైతులను అదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-03-19 15:28 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అకాల వర్షానికి నష్టపోయిన పంటకు ఎకరానికి రూ. 10 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం అకాల వర్షం పడిన నేపథ్యంలో రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన వన శాఖ, విద్యుత్, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… వడగండ్ల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పాడైన పంటల వివరాలు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షానికి పాక్షికంగా, పూర్తిగా ఇండ్లు కూలిపోతే రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో రికార్డు చేపించి నష్ట పరిహారం అందే విధంగా కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ఆదేశించారు. అకాల వర్షానికి నష్ట పోయిన రైతులను, ఇండ్లు కూలిపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


Similar News