Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరం
ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయుల మధ్య తేడా చూపుతూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయుల మధ్య తేడా చూపుతూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ట్రెస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజ ఉత్సవంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడటం తగదన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే సన్మానం చేశారని, గురువులంతా సమానమే అని ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా సన్మానించాలన్నారు.
ఉపాధ్యాయుల అందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడుతున్నారని, ప్రైవేట్ ఉపాధ్యాయులకు శాలరీ లో వ్యత్యాసం ఉంది కానీ సామర్థ్యంలో కాదన్నారు. ప్రైవేటు పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ప్రైవేట్ వ్యవస్థలు చేస్తున్నట్లు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయిన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఉపాధ్యాయులు వ్యక్తులు కాదు భావి పౌరులను తయారు చేసే శక్తులు అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ట్రెస్మా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.