చైన్ స్నాచర్ అరెస్ట్…5 తులాల బంగారం స్వాధీనం..
వరుసగా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేట ఏసీపీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
దిశ, సిద్దిపేట ప్రతినిధి: వరుసగా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేట ఏసీపీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సోమవారం ఉదయం చిన్నకోడూర్ ఎస్ ఐ బాలకృష్ణ సిబ్బంది తో కలిసి రామునిపట్ల గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా, చిగురుమామిడి మండలం గాగిరేడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మం రాకేశ్ సిద్దిపేట వైపు నుండి తన మోటార్ సైకిల్ పై కరీంనగర్ వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనపడడంతో ఆపి తనిఖీ చేశారు.
అతని వద్ద బంగారు ఆభరణాలు ఉండటం, వాటి వివరాలు అడుగగా తడబడుతూ సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి విచారణ చేయగా జల్సాలకు డబ్బులు లేనందున దొంగతనాలు చేసి జల్సాలు చేద్దామని నిర్ణయించుకుని చైన్ స్నాచింగ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. అతను మే 30న రామునిపట్లలో ఓ మహిళ మెడ లోనుంచి చైన్ తెంపేందుకు ప్రయత్నించాడని, హుస్నాబాద్ లోని మడద గ్రామంలో ఆదే రోజు ఓ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు తెంపడం తో పాటు, కొండాపూర్ గ్రామ శివారులో మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు, అంతకు ముందు చిన్నకోడూర్ మండలంలోని చెర్ల అంకిరెడ్డిపల్లి లో వృద్ధురాలి మెడలో నుండి బంగారు పుస్తెల తాడులను తెంపుకొని పారిపోయినట్లు తెలిపారు.
నిందితుడి నుంచి 5 తులాల 9 గ్రాముల బంగారం తో పాటు, దొంగతనానికి ఉపయోగించిన బైక్ ను స్వాధీనం చేసుకొని, జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ, బెజ్జంకి ఎస్సై కృష్ణారెడ్డి, చిన్నకోడూర్ ఏఎస్ఐ దేవయ్య, సిబ్బంది పరుశరాములు, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.