బీఆర్ఎస్.. ఆప్ ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్ర : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనమనేని
దిశ, జహీరాబాద్: రాష్ట్రంలోని బీఆర్ఎస్, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనమనేని సాంబశివరావు ఆరోపించారు. బీజేపీ కండువా కప్పుకోని వారందరినీ మోడీ ప్రభుత్వంలో వేధింపులు తప్పవని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని.. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల కాలంలో ఒక మంచి పని చేయకపోగా.. తొమ్మిది రాజ్యాలను కూల్చివేశాడని ఆరోపించారు. ఈశాన్యంలో ఒక రాష్ట్రంలో గెలిచినప్పటికీ రెండు రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకున్నారన్నారు. దేశంలో కేవలం 9 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉందని, కానీ దేశం మొత్తంలో బీజేపీ అధికారంలో ఉన్నట్లు అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను వినియోగించి తనను వ్యతిరేకిస్తున్న పార్టీల ప్రభుత్వాలను కూల్చేస్తున్నారని ఆరోపించారు.
కుంభకోణాల మాస్టర్ లైన, అవినీతిపరులైన తన స్నేహితులు మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆదానీ లపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం పై ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీల పైనే రాజ్యాంగ సంస్థలను వినియోగించి లొంగదీసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం లాలు ప్రసాద్ యాదవ్ ఆయన కొడుకు, కోడలు, కూతురు అందర్నీ మోదీ కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. ఇలాంటి ఫాసిస్టు పాలన దేశంలో ముందెన్నడూ చూడలేదన్నారు.
హిట్లర్ కూడా తన జాతి విస్తరణ కోసం ఇతర దేశాలపై దండయాత్ర చేసారే కానీ దేశంలోనే ఇతరులపై కాదన్నారు. కానీ బీజేపీ అందుకు భిన్నంగా కులమతాలను రెచ్చగొడుతూ నయా హిట్లర్ లాగా దాడులు చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నారన్నారు. ఆప్ గవర్నమెంట్ ను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోంచి తొలగించాలని ప్రజలను కోరుతున్నామన్నారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పైన ఏసీబీ కేసు లేకున్నా బీజేపీలోకి రానందుకు.. ఈడీ కేసులో జైలుకు పంపించారన్నారు. ఆప్ గవర్నమెంట్‌ను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూడా కవితను పార్టీలోకి ఆహ్వానించినా రాకపోవడంతో ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా ఈడీ కేసులతో వేధిస్తున్నారన్నారు. కవిత బినామీలపై కేసు ఉంటే ఉండొచ్చేమో అయినా కేవలం రూ.100 కోట్లే కదా, రూ. 13 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ అదానీ పై ఎందుకు కేసులు ఉండవని ప్రశ్నించారు.
బీఆర్ఎస్, ఆప్ ప్రభుత్వాలను కూల్చివేసేందుకే కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నలుగురు ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో దొరికిన వారిపై విచారణ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థ లైన బొగ్గు బావులను, ఎల్ఐసి, ఉక్కు పరిశ్రమలు, రైల్వేలను అమ్మేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వల్ల ఒక్క మంచి పని కూడా దేశానికి జరగలేదన్నారు. ఆకలి బాధల్లో దేశం 107 వ స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా "బీజేపీ, నరేంద్ర మోదీకో హటావో -దేశ్ కో బచావో " పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ఇందులో భాగంగా 'ఇంటింటికి సీపీఐ' పేరుతో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
బీజేపీని వ్యతిరేకించేందుకే బీఆర్ఎస్‌కు సపోర్ట్..
బలమైన బీజేపీని వ్యతిరేకించేందుకు మాత్రమే బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేశామని.. దీని అర్థం ప్రజలకు చేసిన వాగ్దానాలను మర్చిపోతే సహించేది లేదన్నారు. అందరికీ పెన్షన్లు, ఇల్లు ఇవ్వాలని, రైతుల కష్టాలను తీర్చాలని, దళిత బంధు పథకం అందరికీ వర్తింప చేయాలన్నారు. కలెక్టర్ ద్వారా పథకం అమలు చేయాలని, నేతల ద్వారా కాదన్నారు. పోడు భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ పరీక్షలు రద్దుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించి, సీఎస్‌ఆర్ నిధులతో జహీరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. స్థానిక పరిశ్రమల దోపిడీపై ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.