యదేచ్చగా ఫుట్ పాత్ ఆక్రమణ.. రోడ్డుపైనే వ్యాపారాలు..

నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణం హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో దినదినాభివృద్ధి చెందుతుంది.

Update: 2024-09-25 11:38 GMT

దిశ, నర్సాపూర్ : నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణం హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో దినదినాభివృద్ధి చెందుతుంది. పట్టణంలో పెరిగిన జనాభా, వాహనాల వల్ల పట్టణ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలో వాహనాల రద్దీ భారీగా పెరిగి ప్రధాన రోడ్ల వెంట వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఫుట్ పాత్ ను ఆక్రమించి చిరు వ్యాపారులతో పాటు పెద్ద పెద్ద దుకాణ యజమానులు వ్యాపారం చేస్తున్నారు. మరి కొందరైతే ఏకంగా రోడ్డుపైనే తోపుడు బండ్లు పెట్టి బిజినెస్ చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్లపైనే వాహనాల నిలపడం, దుకాణాల ఎదుట పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య అవసరాలకు, ఆసుపత్రులకు వచ్చేవారు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే పెద్ద పెద్ద భవనాలు ఉండడంవల్ల పార్కింగ్ స్థలం లేకపోవడంతో వారంతా రోడ్డుపైనే తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు.

యదేచ్ఛగా ఫుట్ పాత్ ఆక్రమణలు...

అయితే నర్సాపూర్ పట్టణం గుండా జాతీయ రహదారి 765 డి వెళ్ళింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయని ఉద్దేశంతో అధికారులు రోడ్డు పక్కన ఫుట్ పాత్ ఏర్పాటు చేసి గ్రిల్స్ వేశారు. అయితే కొంతమంది చిరు వ్యాపారులు బస్టాండ్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా వాటిని తుంగలో తొక్కి యదేచ్చగా ఫుట్పాత్ ను ఆక్రమించి వాటి పై పండ్లు ఇతర దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అలాగే దుకాణాలకు సంబంధించిన సామాగ్రి ఫుట్ పాత్ పై ఉంచి వ్యాపారం సాగిస్తున్నారు. మరికొంతమంది ఏకంగా ప్రధాన రోడ్డును ఆక్రమించి రోడ్లపైనే పండ్ల దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు.

పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తం..

పట్టణంలో పోలీసులు చక్కని పనితీరును కనబరుస్తున్నారు. చేతిలో ట్యాబ్ కెమెరా పట్టుకొని ఫోటోలు తీస్తూ ఫైన్లు వేస్తున్నారు. సిగ్నల్ జంప్ చేసిన, రాంగ్ రూట్లో వాహనాలను నడిపిన, త్రిబుల్ రైడింగ్ చేసిన, ఫోటోలు కొట్టి ఫైన్లతో వాతలు పెడుతూ ప్రజల్లో మాత్రం భయం ఉంచారు.

వెలగని సిగ్నల్ లైట్లు..

పట్టణంలో స్థానిక చౌరస్తా వద్ద ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏర్పాటు చేసిన సిగ్నల్ లైట్లు వెలగడం లేదు. తరచూ అవి పనిచేయకపోవడంతో ఇష్టారీతిన వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా తరచూ జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి. నాలుగు దిక్కుల నుంచి ఒకేసారి వాహనాలు రాకపోకలు సాగించడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. వాహన చోదకులకు దిశానిర్దేశం చేయాల్సిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో వాహన చోదకులతో పాటు పాదాచారులు సైతం పడరాని పాట్లు పడుతున్నారు.


Similar News