పంట పొలాల్లో బీర్ ఫ్యాక్టరీ వ్యర్థాలు.. ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురు దాడి..

ఫ్యాక్టరీలో జమ అయిన వ్యర్థాలను పచ్చని పంట పొలాల మధ్యలో ఇష్టానుసారంగా పడేస్తున్నారు.

Update: 2024-09-18 14:17 GMT

దిశ, సంగారెడ్డి అర్బన్ : ఫ్యాక్టరీలో జమ అయిన వ్యర్థాలను పచ్చని పంట పొలాల మధ్యలో ఇష్టానుసారంగా పడేస్తున్నారు. ఆ వ్యర్థాలు పంట పొలాల మధ్య పడేయడంతో పంటలు పాడవడమే కాకుండా తీవ్రమైన కంపు కొడుతూ స్థానికులకు తీవ్ర నరకప్రాయంగా మారిపోయింది. ఇదేమిటని గ్రామస్తులు వారిని ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని శివ్వంపేటలోని ఏవియన్ బ్లు బీరు ఫ్యాక్టరీ యాజమాన్యం చేస్తున్న నిర్వాకం ఇది. గత కొద్ది రోజులుగా బీర్ ఫ్యాక్టరీలో జమఅవుతున్న వ్యర్ధాలు అన్నిటిని పసల్వాది గణపతి షుగర్ ఫ్యాక్టరీ క్వాటర్స్ సమీపంలోని పంట పొలాల్లో యదేచ్చగా పారేస్తున్నారు.

చెత్తాచెదారం, ఫ్యాక్టరీ వ్యర్ధాలు ఇక్కడ తెచ్చి వేయవద్దని స్థానికులు చెబుతున్న అవేమీ పట్టనట్టు వారు వ్యవహరిస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మా ఇష్టం అన్నట్టు గ్రామస్తుల పై ఎదురుదాడికి దిగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆరుగాలం పంటల పై ఆధారపడి జీవించే రైతులకు అక్కడ ఫ్యాక్టరీ వ్యర్ధాలు పడేయడం, వాటిని అక్కడే కాల్చివేయడంతో పంట నాశనమై తీవ్ర ఆర్థిక నష్టం వచ్చే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. వెంటనే సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం పై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు.


Similar News