బాలాత్రిపుర సుందరీ దేవిగా వర్గల్ అమ్మవారు
వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో భక్తజన జయజయధ్వానాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
దిశ, వర్గల్ : వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో భక్తజన జయజయధ్వానాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఉత్సవాల తొలి రోజు గురువారం సరస్వతీ అమ్మవారి బాలాత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాభిషేకం, కలశస్థాపన, చతుషష్టి ప్రచార పూజలు, మూలమంత్ర హవనము, చండీహోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ శనైశ్చర, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర , శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి క్షేత్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి తీర్థ ప్రసాదాలతో పాటు మహా ప్రసాదం అందజేశారు.