నాటు బాంబు తయారీదారుల ముఠా అరెస్ట్

వన్యప్రాణులను, జంతువులను వేటాడేందుకు నాటు బాంబులను తయారు చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, ఐదుగురిని రిమాండ్ కు తరలించినట్లు హుస్నాబాద్ సీఐ కొండ్రు శ్రీనివాస్ తెలిపారు.

Update: 2024-10-03 15:25 GMT

దిశ, హుస్నాబాద్: వన్యప్రాణులను, జంతువులను వేటాడేందుకు నాటు బాంబులను తయారు చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, ఐదుగురిని రిమాండ్ కు తరలించినట్లు హుస్నాబాద్ సీఐ కొండ్రు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ బుధవారం హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో నాటు బాంబులు ఉన్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో వెంటనే ఎస్సై తో సహా పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయడంతో నాటు బాంబులు దొరికాయని అన్నారు. కాగా మూడు నెలల క్రితం మీర్జాపూర్ లో గుర్తు తెలియని వ్యక్తులు గుట్ట పక్కన ఉన్న వ్యవసాయ క్షేత్రాల వద్ద జంతువులు వన్యప్రాణుల కోసం నాటుబాంబులు పెట్టగా ప్రమాదవశాత్తు ఆ బాంబు పేలి అదే గ్రామానికి చెందిన ఎండి ఖలీం చేతివేళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే అతడిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో ఖలీమ్ సోదరుడు తాజుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది అప్పట్లో జిల్లాలోనే కలకలం రేపింది. ఈ క్రమంలో బుధవారం ఓ ఇంట్లో నాటుబాంబులు ఉన్నట్లు సమాచారం రావడంతో బాంబులు దొరికాయని, వెంటనే నాటు బాంబులు తయారు చేస్తున్న పిట్టల స్వామి, బదనాపురం తిరుపతి, ఎరుకల తిరుపతి, కందుకూరి భాస్కర్, శ్రీమంతుల శ్రీను లను అరెస్టు చేసే విచారించగా నేరం అంగీకరించినట్లు తేలడంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్ కానిస్టేబుల్స్ నరేష్, రాజు, శేఖర్ తదితరులు ఉన్నారు.


Similar News