అధికారంలోకి వచ్చిన వెంటనే అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కటిక చీకటి అవుతుందని మాట తప్పే కాంగ్రెస్ నాయకులకు ఓటు వేస్తారా మాటమీద నిలబడే కేసీఆర్‌కు ఓటు వేస్తారా ప్రజలు తెలుసుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు.

Update: 2023-11-10 11:10 GMT

దిశ, నర్సాపూర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కటిక చీకటి అవుతుందని మాట తప్పే కాంగ్రెస్ నాయకులకు ఓటు వేస్తారా మాటమీద నిలబడే కేసీఆర్‌కు ఓటు వేస్తారా ప్రజలు తెలుసుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాలో అశేష జనవాహిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ... కాంగ్రెస్ నాయకుల బట్టేబాజ్ మాటలను ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. కొడంగల్ ఎన్నికల్లో ఓడిపోతే ఎలక్షన్‌ నుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి అన్నాడని, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గడ్డం తీసుకోనని మాట తప్పిన కాంగ్రెస్ నాయకుల మాటలు వింటారో మాట తప్పని మడమ తిప్పని కేసీఆర్ ప్రజలు నమ్ముతారో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే అసైన్డ్ భూములకు పట్టా హోదాను కల్పిస్తామన్నారు.

అలాగే కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమాను అందజేస్తామని తెలిపారు. 11 సార్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే ఏమి చేయలేదనీ విమర్శించారు. బీజేపీకి ఒకటే సీటు వచ్చింది, ఈసారి డిపాజిట్లు కూడా రావనీ అన్నారు. బీజేపీ డక్ అవుట్, కాంగ్రెస్ రన్ అవుట్, కేసీఆర్ సెంచరీ కొడతారని తెలిపారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఇప్పటివరకు సర్పంచ్ కూడా కాలేదనీ విమర్శించారు. కేసీఆర్ తో ఉన్న అనుబంధంతో మదన్ రెడ్డి అభివృద్ధి చేశాడు. రేపు గెలిస్తే ఇద్దరు అభ్యర్థులు అభివృద్ధికై కృషి చేస్తారనీ తెలిపారు. నర్సాపూర్ అభివృద్ధికై ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 65 కోట్లను మంజూరు చేశారనీ అన్నారు.




సునీతా రెడ్డిని ఎమ్మెల్యే చేయండి, మదన్ రెడ్డిని ఎంపీ చేసే బాధ్యత నాదనీ అన్నారు. 20 రోజులు కష్టపడితే 60 నెలలు మీకోసం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, లేబర్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి తోపాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో బ్యాండ్ మేళాలు, డప్పు చప్పుళ్ళు, డోలు వాయిద్యాలు నడుమ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ నామినేషన్ కేంద్రానికి వచ్చి నామినేషన్ వేశారు.

Tags:    

Similar News