వైభవంగా ఆది దంపతుల కల్యాణం…

అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

Update: 2024-03-10 16:11 GMT

దిశ, ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 4:30 నిమిషాలకు స్వామివారికి నిత్య పూజ అనంతరం పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులు పల్లకిలో తీసుకెళ్లి వైదిక క్రతువులు, శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ సకల దేవతలను ఆహ్వానించి అగ్నిదేవునికి పూజలు నిర్వహించి అగ్నిగుండ ప్రవేశాన్ని ప్రారంభించారు. అనంతరం భారీగా తరలివచ్చిన భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం 8:00 గంటలకు ఆదిదంపతుల పరిణయోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆది దంపతులకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. డోలు సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా.. రమణీయంగా సాగింది. కళ్యాణోత్సవానికి 79 మంది దంపతులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉండే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అమావాస్య కావడంతో రద్దీ భారీగా పెరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సురేష్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత హనుమంతరావు పాటిల్, మాజీ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఎంపీటీసీ రజిని ప్రియ సంతోష్ పాటిల్, ఇన్స్పెక్టర్ రంగారావు,ఆలయ కార్యనిర్వహణ అధికారి శశిధర్ గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు భక్తులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.


Similar News